NTV Telugu Site icon

India-Canada: కెనడాకు భారత్ అల్టిమేటం.. ప్రైవేటుగా చర్చిస్తామంటున్న కెనడా..

India Vs Canada

India Vs Canada

India-Canada: భారత్, కెనడాల మధ్య దౌత్యవివాదం మరింత ముదురుతోంది. ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ని గుర్తు తెలియని వ్యక్తులు జూన్ నెలలో కెనడాలోని సర్రే ప్రాంతంలో కాల్చి చంపారు. అయితే ఇటీవల ఈ హత్యతో భారత ఏజెంట్లకు సంబంధం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యానించడంతో వివాదం పెద్దదైంది. దీంతో పాటు కెనడా, భారత సీనియర్ దౌత్యవేత్తను ఆ దేశం నుంచి బహిష్కరించింది. భారత్ ఇందుకు ప్రతిగా కెనడియన్ దౌత్యవేత్తను దేశం వదిలి వెళ్లాలని ఆదేశించింది.

ఈ నేపథ్యంలో భారత్ మరోసారి కెనడాకు అల్టిమేటం జారీ చేసింది. భారతదేశంలో కెనడా దౌత్యవేత్తలను 41 మంది దౌత్యవేత్తలను తగ్గించుకోవాలని కోరింది. అక్టోబర్ 10 నాటికి ఈ ప్రక్రియ చేపట్టాలని కెనడాకు సూచించింది. ఒకవేళ గడువు ముగిసిన తర్వాత కెనడా దౌత్యవేత్తలు ఇండియాలో ఉంటే వారికి ఉండే ప్రత్యేక అనుమతులు రద్దు చేయబడతాయని ప్రభుత్వం చెప్పినట్లు తెలుస్తోంది. ఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక ప్రకారం 62 మంది ఉన్న కెనడియన్ దౌత్యవేత్తలను 41కి తగ్గించాలని కెనడాను భారత్ కోరినట్లు పేర్కొంది.

Read Also: Revanth Reddy: తెలంగాణలో బీజేపీని నడిపిస్తుంది బీఆర్ఎస్సే..

అయితే తాజాగా దీనిపై కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ కీలక వ్యాఖ్యలు చేశారు. దౌత్య సంక్షోభాన్ని పరిష్కరించుకోవడానికి భారత్ తో కెనడా ప్రైవేట్ చర్చలను కోరుతుందని అన్నారు. ‘‘మేము భారత ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాము. కెనడియన్ దౌత్యవేత్తల భద్రతను మేం సీరియస్ గా తీసుకుంటాము. ప్రైవేటుగా ఉన్నప్పుడు దౌత్య సంభాషణలు ఉత్తమమని భావిస్తున్నాము’’ అని కెనడా మంత్రి చెప్పారు. మంగళవారం కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మాట్లాడుతూ.. తమ దేశం, భారత్ తో ఉద్రిక్తతలను పెంచుకోవానుకోవడం లేదని, న్యూఢిల్లీతో బాధ్యయుత, నిర్మాణాత్మక బంధం కొనసాగుతుందని ఆయన అన్నారు.

కెనడాలోని బ్రిటీష్ కొలంబియా ప్రాంతంలో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ని ఇద్దరు ముష్కరులు గురుద్వారా ముందే కాల్చి చంపారు. ఈ పరిణామం రెండు దేశాల మధ్య తీవ్ర విభేదాలు సృష్టించింది. కెనడా చేసిన ఆరోపణల్ని భారత్ అసంబద్ధ, ప్రేరేపిత వ్యాఖ్యలు కొట్లి పారేసింది. కెనడా ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఉందని భారత విదేశాంగ శాఖ ధ్వజమెత్తింది.