NTV Telugu Site icon

Priyank Kharge: ‘‘ఖర్గే ఫ్యామిలీపై రజాకార్ దాడి’’.. యోగి వ్యాఖ్యలపై స్పందించిన ఖర్గే కుమారుడు..

Priyank Kharge

Priyank Kharge

Priyank Kharge: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇటీవల కాంగ్రెస్ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే గతాన్ని ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. నిజాం హయాంలో అప్పటి హైదరాబాద్ ప్రాంతంలోని ఖర్గే గ్రామంపై రజాకార్లు దాడి చేసి, ఖర్గే ఇంటిని కాల్చిన సంగతిని గుర్తు చేశారు. ఈ ఘటనలో ఖర్గే తల్లితో పాటు ఆయన కుటుంబం కూడా మరణించారు. ఈ విషయాన్ని యోగి ఆదిత్యనాథ్ చెబుతూ.. తన కుటుంబ త్యాగాన్ని మరిచి ఖర్గే ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాడని విమర్శించారు.

అయితే, ఈ వ్యాఖ్యలపై ఖర్గే కుమారుడు కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే స్పందించారు. వ్యక్తిగత విషాదాన్ని ‘‘రాజకీయ లబ్ధి’’ కోసం
తన తండ్రి ఎప్పుడూ ఉపయోగించుకోలేదని అన్నారు. ‘‘సాధువుల వేషంలో ఉన్న వారు రాజకీయాల నుంచి తప్పుకోవాలి’’ అని మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా యోగి ‘‘రజాకార్ దాడి’’ గురించి గుర్తు చేశారు.

Read Also: Alexei Zimin: రష్యా సెలిబ్రిటీ చెఫ్, పుతిన్ విమర్శకుడు అనుమానాస్పద మృతి..

ప్రియాంక్ ఖర్గే మాట్లాడుతూ.. ఈ విషాద ఘటనలో తన తండ్రి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారని, 9 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్రమంత్రి, ప్రతిపక్ష నేతగా, కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎదిగారని అన్నారు. ‘‘ఈ విషాదం జరిగినప్పటికీ, ఖర్గే ఎప్పుడూ దానిని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోలేదు. బాధితుడిని అని ఎప్పుడూ సింపతీ కోసం ట్రై చేయలేదు.’’ అని ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు. ఖర్గే కుటుంబంపై దాడి చేసింది రజాకార్లు, మొత్తం ముస్లిం సమాజం కాదని కర్ణాటక మంత్రి అన్నారు.

బుద్ధుడు-బసవన్న-అంబేద్కర్‌ల విలువలను కాపాడేందుకు, రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు 82 ఏళ్ల కాంగ్రెస్ అధినేత అలుపెరగని పోరాటం చేస్తున్నారని ప్రియాంక్ ఖర్గే అన్నారు. యోగి జీ మీ ద్వేషాన్ని వేరే చోటుకి తీసుకెళ్లండి, రాజకీయ ప్రయోజనాల కోసం సమాజంలో విద్వేషాన్ని నాటడానికి ప్రయత్నించే బదులుగా పీఎం మోడీ అభివృద్ధిపై చర్చించి గెలవండి అంటూ సవాల్ విసిరారు.

Show comments