NTV Telugu Site icon

Tahawwur Rana: ముంబై ఉగ్రదాడుల్లో పాక్ ఐఎస్ఐ ప్రమేయం.. మేజర్ ఇక్బాల్, సమీర్‌ల పాత్ర..

Tahawwur Rana

Tahawwur Rana

Tahawwur Rana: 26/11 ముంబై ఉగ్రదాడుల కీలక కుట్రదారు, ఉగ్రవాది అయిన పాక్-కెనెడియన్ తహవూర్ రాణాని భారత అధికారులు గురువారం అమెరికా నుంచి ఇండియాకు తీసుకువచ్చారు. అమెరికా న్యాయస్థానాల్లో భారత్‌కి అప్పగించకుండా ఉండేందుకు అన్ని న్యాయ సదుపాయాలను రాణా ఉపయోగించుకున్నాడు. అయితే, ఈ కేసులో అక్కడి న్యాయస్థానాలు ఉగ్రవాది రాణాని భారత్‌కి అప్పగించింది. గురువారం, న్యూఢిల్లీలో దిగిన వెంటనే, అధికారికంగా ఎన్ఐఏ అరెస్ట్ చేసి, పాటియాలా కోర్టుకు తరలించింది. 18 రోజుల కస్టడీ విధించింది.

అయితే, ముంబై ఉగ్రదాడుల కేసులో పాకిస్తాన్ గూఢచార సంస్థ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) పాత్ర ఉందని ఆరోపించబడిన విషయం మరోసారి వెలుగులోకి వచ్చింది. ఈ కుట్రలో ఇద్దరు పాకిస్తాన్ ఆర్మీ అధికారుల ప్రమేయం ఉంది. వీరిని మేజర్ ఇక్బార్, మేజర్ సమీర్ అలీ ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నారు. ఎన్ఐఏ వర్గాల ప్రకారం, వీరిద్దరితో రాణాకి ఉన్న సంబంధాలపై విచారించనున్నారు. ఐఎస్ఐ అధికారిగా పనిచేస్తున్న మేజర్ ఇక్బాల్ కీలక సూత్రధారిగా ఉన్నాడు.

Read Also: CM Chandrababu: వారికి అదే చివరిరోజు.. సీఎం చంద్రబాబు సీరియస్‌ వార్నింగ్..

పాకిస్తాన్ అమెరికన్ డబుల్ ఏజెంట్ డేవిడ్ కోల్మన్ హెడ్లీ ( దావూద్ సయీద్ గిలానీ) సేకరించిన నిఘా సమాచారం, ప్లాన్‌కి కావాల్సిన వివరాలను సేకరించడానికి కావాల్సిన ఆర్థిక సాయాన్ని అందించిన వ్యక్తిగా మేజర్ ఇక్బాల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరణశిక్ష నుంచి తప్పించుకోవడానికి 2010లో హెడ్లీ నేరాన్ని అంగీకరించాడు. మేజర్ ఇక్బాల్ తన ప్రైమరీ హ్యాండ్లర్‌గా చెప్పాడు. 2011లో హెడ్లీ ఇచ్చిన సాక్ష్యంలో తాను ‘‘చౌదరీ ఖాన్’’ అనే వ్యక్తితో ఈమెయిల్స్ మార్పిడి చేసుకున్నట్లు తెలిపాడు. ఇది మేజర్ ఇక్బాల్ కి మారుపేరు.

ఒక ఈమెయిల్‌లో హెడ్లీని ప్రాజెక్టులు, నిఘా పరికరాల గురించి మేజర్ ఇక్బాల్‌కి అప్‌డేట్ చేయాలనే ఆదేశాలు ఉన్నాయి. అమెరికా అభియోగ పత్రం మేజర్ ఇక్బాల్‌ని లష్కర్ దాడులకు ప్లాన్ చేసి, నిధులు సమకూర్చిన పాకిస్తాన్ వ్యక్తిగా అభివర్ణించింది. ఉగ్రవాదం, హత్యలకు సాయం చేసినందుకు అతడిపై అభియోగాలు నమోదయ్యాయి. ఇతడే లష్కరే తోయిబాకు నిధులు సమకూర్చినట్లు ఆరోపించారు.

మేజర్ సమీర్ అలీ మరో ఐఎస్ఐకి చెందిన నిందితుడు. 26/11 హ్యాండ్లర్ జబియుద్దీన్ అన్సారీ (అలియాస్ అబు జుందాల్)ని ఢిల్లీ పోలీసులు 2012లో అరెస్ట్ చేశారు. ఇతడి ప్రకారం, సమీర్ అలీ కరాచీలోని మలిర్ కంటోన్మెంట్‌లోని మిలిటరీ ఏరియాలో ఏర్పాటు చేసిన లష్కరే తోయిబా కంట్రోల్ రూం నుంచి రియల్ టైమ్‌లో దాడుల్ని పర్యవేక్షించాడు. ముంబై దాడుల సమయంలో సమీర్ అలీ లష్కరే తోయిబా కమాండర్ జాకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీకి ఆదేశాలు జారీ చేసినట్లు జుందాల్ తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. సమీర్ అలీ కోసం ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. అయితే, పాకిస్తాన్ మాత్రం ఈ విషయాన్ని పదేపదే తిరస్కరించింది.