Lt General Dhiraj Seth: కొత్త ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్..

  • కొత్త ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్..
  • జనరల్ ఉపేంద్ర ద్వివేది స్థానంలో నియామకం..
Lt General Dhiraj Seth

Lt General Dhiraj Seth

Lt General Dhiraj Seth: ప్రస్తుతం ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది జూన్ 30న పదవీ విరమణ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వారసుడు ఖరారయ్యారు. కొత్త చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్(ఆర్మీ చీఫ్)గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ నియమితులయ్యారు. ప్రస్తుతం ‘వైస్ చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్’గా సేవలందిస్తున్న లెఫ్టినెంట్ జనరల్ సేథ్, ఖడక్‌వాస్లాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థి. ఆయన 1986 డిసెంబర్‌లో ‘ఆర్మర్డ్ కార్ప్స్’లో నియమితులయ్యారు. ఆయన డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీలో జూనియర్ కమాండ్ కోర్సులో ప్రథమ స్థానం సాధించి, ఉత్తమ ఆల్-రౌండ్ స్టూడెంట్ ఆఫీసర్ పతకాన్ని అందుకున్నారు.

దాదాపు నాలుగు దశాబ్ధాల సుదీర్ఘ అనుభవం ఆయన సొంతం. విశిష్ట సైనిక సేవా కాలంలో ఆయన కార్యకలాపాలు, వ్యూహాత్మక ప్రణాళికలు, సామర్థ్యాల పెరుగుదల, సంస్థాగత విభాగాలలో విస్తృత అనుభవాన్ని కలిగి ఉన్నారు. భారత సైన్యం పోరాట సామర్థ్యాన్ని బలోపేతం చేయడంతో విశేష కృషి చేశారు. సైనిక దళాల ఆధునీకీకరణలో తనదైన ముద్ర వేశారు. సేథ్ జమ్మూ కాశ్మీర్‌లో ఒక సాయుధ రెజిమెంట్, ఒక సాయుధ బ్రిగేడ్‌లకు నాయకత్వం వహించారు.

×
×
Ad

లెఫ్టినెంట్ జనరల్ హోదా పొందిన తర్వాత ఆయన సుదర్శన్ చక్ర కార్ప్స్‌కు కమాండర్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత ఢిల్లీ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్ (GOC)గా పనిచేస్తూ, అనేక ప్రధాన జాతీయ మరియు అంతర్జాతీయ కార్యకలాపాలను పర్యవేక్షించారు. అనంతరం లెఫ్టినెంట్ జనరల్ సేథ్, సౌత్ వెస్ట్రన్ కమాండ్ మరియు సదరన్ కమాండ్ రెండింటికీ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ (GOC-in-C)గా పనిచేశారు. దీని ద్వారా రెండు ఆపరేషనల్ కమాండ్‌లకు నాయకత్వం వహించిన అరుదైన ఘనతను సాధించారు. ఇదే కాకుండా అంగోలాలో ఐక్యరాజ్యసమితి మిషన్‌లో సెక్రటరీగా, సౌత్ వెస్ట్రన్ కమాండ్ హెడ్‌క్వార్టర్స్‌లో బ్రిగేడియర్ జనరల్ స్టాఫ్ (ఆపరేషన్స్)గా, మరియు డైరెక్టర్ జనరల్ డిసిప్లిన్, సెరిమోనియల్ అండ్ వెల్ఫేర్ వంటి అనేక కీలక స్టాఫ్ మరియు వ్యూహాత్మక పదవులను కూడా నిర్వహించారు.