NTV Telugu Site icon

Odisha: భార్యపై అనుమానం.. పసిబిడ్డకు పురుగుమందుతో ఇంజెక్షన్..

Odisha

Odisha

Odisha: భార్యపై అనుమానంతో పసిపాప ప్రాణాలు తీసేందుకు ప్రయత్నించాడు ఓ కసాయి తండ్రి. బిడ్డకు పురుగుమందు ఇంజెక్షన్ ఇచ్చారు. ప్రస్తుతం పాప ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటన ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగింది. పసికందును సోమవారం బాలాసోర్‌లోని జిల్లా ప్రధాన ఆసుపత్రిలో చేర్చగా, ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి అధికారులు తెలిపారు. మంగళవారం వరకు ఎలాంటి ఫిర్యాదు నమోదు కాకపోవడంతో కేసును సుమోటోగా స్వీకరించి దర్యాప్తు జరుపుతున్నట్లు బాలసోర్ ఎస్పీ సాగరిక నాథ్ వెల్లడించారు.

Read Also: Brahmos Misfire: బ్రహ్మోస్ మిస్ ఫైర్.. 24 కోట్ల నష్టం.. ఢిల్లీ హైకోర్టుకు సమాచారమిచ్చిన కేంద్రం

వివరాల్లోకి వెళితే నిందితుడు చందన్ మహానాకు తన్మయితో గతేడాది వివాహం జరిగింది. ఇటీవల మే 9న వీరికి పాప జన్మించింది. అయితే తన భార్యకు వివాహేతర సంబంధం ఉందని అనుమానం పెంచుకున్న చందన్ బిడ్డకు తండ్రి నేను కాదని వేరేవారని అనుమానం పెంచుకున్నాడు. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత తన్మయిని ఆమె అత్తమామలు నీలగిరి పోలీసు పరిధిలోని సింఘిరి గ్రామంలోని ఆమె తల్లిదండ్రుల ఇంటికి పంపించారు.

చందన్ సోమవారం తన అత్తామామ ఇంటికి వెళ్లిన సమయంలో బిడ్డను చంపేందుకు ప్రయత్నించాడు. పాప ఏడుపు విన్న తన్మయి వాష్ రూం నుంచి బయటకు వచ్చి చూడగా భర్త చేతిలో సిరంజి, పక్కనే పురుగుమందు డబ్బా కనిపించింది. మొదటగా తాను ఏం చేయలేదని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించినా..తాను పురుగుమందును పాపకు ఇంజెక్షన్ గా ఇచ్చినట్లు ఒప్పుకున్నాడు. వెంటనే జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు పసికందును సమీపంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తరలించారు. శిశువు పరిస్థితి విషమించడంతో బాలాసోర్ లోని ఆస్పత్రికి తరలించారు.