Supriya Sule: మహారాష్ట్ర రాజకీయాల్లో గత కొద్దిరోజులుగా ఎన్సీపీ (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ) రెండు వర్గాల పునరేకీకరణపై నడుస్తున్న ఉత్కంఠకు ఎంపీ సుప్రియా సూలే తెరదించారు. నేతల వరుస భేటీలు, రాజకీయ ప్రకటనల నడుమ ‘మళ్లీ కలుస్తారా?’ అన్న సస్పెన్స్‌కు ముంబైలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె ఫుల్ స్టాప్ పెట్టారు. అజిత్ పవార్ జీవించి ఉన్న సమయంలో తెరవెనుక అసలు ఏం జరిగిందో, విలీన చర్చలు ఎంతవరకు వచ్చాయో సుప్రియా సూలే మొదటిసారి బహిరంగంగా వెల్లడించారు.
అసలు ఆ రోజు ఏం జరిగిందంటే..
2023 జులైలో అజిత్ పవార్ పార్టీ నుంచి విడిపోయి సొంత వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నప్పటి నుంచి, ఇరు వర్గాలు మళ్లీ ఒక్కటవుతాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటీవల ఇరుపక్షాల నేతల సమావేశాలు ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చాయి. దీనిపై సుప్రియా సూలే స్పందిస్తూ సంచలన విషయాన్ని బయటపెట్టారు. అజిత్ పవార్ ఉన్నప్పుడు రెండు వర్గాల విలీనంపై సీరియస్‌గా చర్చలు జరిగాయని ఆమె అంగీకరించారు. ఇది ఏదో సాధారణ చర్చ కాదని, ఇరు వర్గాల మధ్య సానుకూల వాతావరణంలో ఒక నిర్ణయానికి వచ్చి, విలీనానికి సంబంధించి ఒక తేదీని కూడా ఖరారు చేసుకున్నట్లు ఆమె వెల్లడించారు. అయితే, ఆ ఖరారైన తేదీ ఏమిటనే విషయాన్ని మాత్రం ఆమె బయటికి చెప్పలేదు. అంత దూరం వెళ్లిన విలీన ప్రక్రియకు అజిత్ పవార్ మరణంతో బ్రేక్ పడిందని సుప్రియా సూలే భావోద్వేగంతో చెప్పారు. మీడియా సమావేశంలో చేతులు జోడించి మరీ, ఇకపై ఈ విలీన అంశంపై ఎలాంటి చర్చలు జరపదలుచుకోలేదని స్పష్టం చేశారు. “ఇప్పుడు మా అన్నయ్య లేనప్పుడు, ఇక విలీనం గురించి మాట్లాడుకోవడంలో అర్థం ఏముంది?” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సోదరుడి మరణంతో తన దృష్టిలో ఈ అధ్యాయం పూర్తిగా ముగిసిపోయిందని, భవిష్యత్తులో దీనిపై ఎలాంటి ప్రశ్నలు అడిగినా తాను స్పందించబోనని తేల్చి చెప్పారు.
ఎన్డీఏలో చేరికపై క్లారిటీ
ప్రస్తుతం అజిత్ పవార్ వర్గం నుంచి విలీనానికి సంబంధించి తనకు ఎలాంటి ఫోన్ కాల్స్, మెసేజ్‌లు లేదా ఈమెయిల్స్ రాలేదని సుప్రియా సూలే స్పష్టం చేశారు. తనకు తెలిసినంతవరకు ఎలాంటి కొత్త ప్రతిపాదనలు లేవని, ఎన్డీఏ కూటమిలో చేరే విషయమై కూడా ఎటువంటి సంప్రదింపులు జరగలేదని ఆమె తేల్చి చెప్పారు.ఇదే సమయంలో శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ వ్యాఖ్యలు, ఆయన రాసిన కథనాలపై స్పందిస్తూ, ప్రజాస్వామ్యంలో ఎవరి అభిప్రాయాన్ని వారు చెప్పే హక్కు ఉందన్నారు. సంజయ్ రౌత్ తనకు పెద్దన్న లాంటి వారని, ఆయనకు సరైనదని అనిపించిన విషయాలను రాసే స్వేచ్ఛ ఉందని పేర్కొన్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు లోక్‌సభ స్థానాలను 50 శాతం పెంచే ప్రతిపాదనను ప్రభుత్వం తమ ముందుంచిందని సులే తెలిపారు. ఈ ప్రతిపాదనతో పాటు మహిళా రిజర్వేషన్లకు తాము మద్దతు ఇచ్చామని, మూడు నెలల క్రితం ఉన్న వైఖరికే ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.
రాహుల్ గాంధీ ఫోన్ ట్యాపింగ్‌కు గురైందన్న ప్రశ్నపై మాట్లాడుతూ.. ఆ విషయం తన దృష్టికి రాలేదన్నారు. దీనిపై రాహుల్ గాంధీ, ఆదిత్య ఠాక్రేలతో మాట్లాడతానని, ఒకవేళ వారి ఫోన్లు ట్యాప్ చేసి ఉంటే అది ముమ్మాటికీ తప్పేనని ఆమె అభిప్రాయపడ్డారు. మొత్తానికి, అజిత్ పవార్‌తో విలీన తేదీ ఖరారైన విషయాన్ని బయటపెడుతూనే, ఆయన లేని లోటుతో ఆ చర్చలకు శాశ్వతంగా ముగింపు పలుకుతున్నట్లు సుప్రియా సూలే ప్రకటించడం ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాలతో పాటు జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

