Justice Shekhar Kumar Yadav: విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ) కార్యక్రమంలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ చేసిన ‘‘మెజారిటీ’’ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రతిపక్షాలు, పలు సంఘాలు సుప్రీంకోర్టుకు లేఖలు రాస్తున్నాయి. భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా ఈ ఫిర్యాదులను స్వీకరించారు. ఈ ప్రసంగంపై సుప్రీంకోర్టు అలహాబాద్ హైకోర్టుని మంగళవారం వివరణ కోరింది. ప్రసంగానికి సంబంధించిన వివరాలనున అందించాలని ఆదేశించింది.
జస్టిస్ శేఖర్ యాదవ్‌ని తొలగించాలని కోరుతూ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నోటీసుపై సంతకం చేయడంతో లోక్‌సభలో కూడా చర్చనీయాంశంగా మారింది. న్యాయమూర్తి ప్రవర్తన రాజ్యాంగ నిబంధనల్ని ఉల్లంఘించిందని ఓవైసీ అన్నారు. “అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి శేఖర్ యాదవ్‌పై తొలగింపు చర్యలను కోరుతూ నేను నోటీసుపై సంతకం చేసాను. నోటీసులో 100 మంది లోక్‌సభ సభ్యుల సంతకం అవసరం అని, అప్పుడే లోక్‌సభ స్పీకర్ పరిగణనలోకి తీసుకుంటారు” అని ఓవైసీ చెప్పారు.
Read Also: Undavalli Arun Kumar Open Letter: డిప్యూటీ సీఎం పవన్‌కు ఉండవల్లి బహిరంగ లేఖ.. ఆ బాధ్యత మీదే..!
గత వారం వీహెచ్‌పీ లీగల్ సెల్ నిర్వహించిన కార్యక్రమంలో జస్టిస్ శేఖర్ యాదవ్ మాట్లాడుతూ.. మెజారిటీల(హిందువుల) అభీష్టం మేరకు భారతదేశం పనిచేస్తుందని ఆయన అన్నారు. ముస్లిం కమ్యూనిటీ పేరుని నేరుగా ప్రస్తావించకుండా.. చిన్నప్పటి నుంచి వారి ముందు జంతువుల్ని చంపినప్పుడు వారి పిల్లలు ఎలా దయగా, సహనంలో ఉంటారని ప్రశ్నించారు. సమాజంలో ప్రతీ ఒక్కరూ చెడ్డవారు కానప్పటికీ కఠ్ముల్లాలు దేశానికి ప్రమాదం అని అన్నారు.
ఈ వ్యాఖ్యలపై సోమవారం సీపీఎం నేత బృందాకారత్, క్యాంపెయిన్ ఫర్ జ్యుడీషియల్ అకౌంటబిలిటీ అండ్ రిఫార్మ్స్ (సీజేఏఆర్) ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. జస్టిస్ శేఖర్ యాదవ్‌పై అంతర్గత విచారణ జరపాలని డిమాండ్ చేశారు. పెండింగ్ కేసుల నుంచి న్యాయమూర్తిని తొలగించాలని కోరారు. ఇలాంటి చర్యలు న్యాయవ్యవస్థకు, మొత్తం న్యాయవ్యవస్థకే చెడ్డపేరు తెస్తాయని రాజ్యసభ మాజీ ఎంపీ బృందా కారత్ తన లేఖలో పేర్కొన్నారు.