బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఓటర్ల జాబితా సవరణపై తీవ్ర దుమారం చెలరేగుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం అధికార పార్టీ రిగ్గింగ్‌కు పాల్పడే విధంగా వ్యవహారిస్తోందని కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది.
ఇది కూడా చదవండి: Senior Actress : సౌత్ ఇండస్ట్రీపై కన్నేసిన ఆ తల్లికూతుళ్లు
జూన్ 25న బీహార్‌లో ఎన్నికల సంఘం ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశం తర్వాతే రాజకీయ దుమారం చెలరేగింది. అధికార పార్టీకి అనుకూలంగా ఎన్నికల సంఘం వ్యవహారిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఓటర్ల జాబితా సవరణకు పూనుకుంది. దీన్ని సవాలు చేస్తూ సుప్రీంలో పది పిటిషన్లు దాఖలయ్యాయి. అధికార పార్టీకి అనుకూలంగా ఈసీ వ్యవహరిస్తోందని ప్రతిపక్ష పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. గురువారం ధర్మాసనం విచారణ చేపట్టగా.. ఈ సందర్భంగా పోల్ కసరత్తు సమయాన్ని న్యాయస్థానం ప్రశ్నించింది. ఆధార్ కార్డును మినహాయించడంపై ఎన్నికల సంఘం తీరును తీవ్రంగా తప్పుపట్టింది. ఈసీ తప్పనిసరి చేసిన 11 పత్రాల జాబితాలో ఆధార్ కార్డు ఎందుకు లేదనే దానిపై ప్రత్యక్ష సమాధానం ఇవ్వాలని ఎన్నికల సంఘం నుంచి వివరణ కోరింది. 10 పిటిషన్లను న్యాయమూర్తులు సుధాంషు ధులియా, జోయ్‌మల్య బాగ్చిలతో కూడిన ఇద్దరు సభ్యుల ధర్మాసనం విచారించింది.
ఇది కూడా చదవండి: Off The Record: రాజకీయంగా పార్టీలు వేరైనా.. దోచుకోవడానికి అందరు ఒకటేనా?
పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ వాదనలు వినిపిస్తూ.. అన్ని పిటిషన్ల వెనుక ప్రధాన కారణం ఆధార్ అని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం గుర్తింపు కార్డు (ECI)ను గణన పత్రాల జాబితా నుంచి తొలగించడమేనని తెలిపారు. కోర్టు విచారణ సందర్భంగా సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి మాట్లాడుతూ.. ఈసీ తీరుతో అర్హత ఉన్న ఓటరు కూడా తన ఓటు హక్కును కోల్పోవడమేనన్నారు. ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తుందని, ప్రాథమిక నిర్మాణాన్ని నేరుగా దెబ్బతీస్తుందని వ్యాఖ్యానించారు.
పౌరసత్వాన్ని నిర్ణయించే అధికారం ఈసీకి లేదని న్యాయస్థానం తెలిపింది. పౌరసత్వాన్ని నిరూపించుకోవాలని ఓటర్లను ఈసీ బలవంతం చేస్తోందని ధ్వజమెత్తింది. జూలై 25 కల్లా అధీకృత డాక్యుమెంట్లు చూపించకుంటే… ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తున్నారని పిటిషనర్లు ఆరోపించారు. ఈ రివిజన్ వల్ల ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ ఓటర్లను జాబితా నుంచి తొలగించేందుకే ఈ కసరత్తు చేపట్టారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. బీజేపీని వ్యతిరేకిస్తున్న వర్గాలను ఓటర్ల జాబితా నుంచి తొలగించే ప్రక్రియ చేపట్టారని ఆరోపణలు చేశాయి. ఎన్నికలకు అతి తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో స్పెషల్ రివిజన్ ఆపివేయాలని విపక్షాలు కోరాయి. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం తీరును ధర్మాసనం తప్పుపట్టింది. దీనిపై వివరణ ఇవ్వాలని కోరింది.
ఈ ఏడాది చివరిలో జరిగే ఎన్నికల కోసం ఈసీ తీవ్ర కసరత్తు చేస్తోందని.. బుధవారం ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తెలిపారు. అనర్హుల పేర్లను తొలగించి, అర్హులైన పౌరులను మాత్రమే ఓటర్ల జాబితాలో చర్చడానికి రెండు దశాబ్దాలుగా తీవ్ర కసర్తు చేస్తున్నట్లు పోల్ బాడీ తెలిపింది. ఈ కార్యక్రమంలో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొంటున్నారని జ్ఞానేష్ కుమార్ తెలిపారు.
అయితే బీహార్‌లో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రక్రియపై విపక్షాలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తమకు అనుకూలంగా బీజేపీ రిగ్గింగ్ పాల్పడిందని.. ఇప్పుడు బీహార్‌లో కూడా అదే మాదిరిగా ఎన్డీఏ చేయబోతుందని ఆరోపించారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని పేర్కొన్నారు.
