NTV Telugu Site icon

Supreme Court: సుప్రీంకోర్టు సరికొత్త రికార్డు

Sci

Sci

దేశ అత్యున్నత న్యాయస్థానం సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒకే రోజు ఏకంగా 44 తీర్పులిచ్చింది. ఇది ఈమధ్య కాలంలో ఒక రికార్డు కావటం విశేషం. మే నెల 23 నుంచి జూలై 10 వరకు సుప్రీంకోర్టుకు సమ్మర్‌ హాలిడేస్‌ కాగా మొన్న 11వ తేదీన తిరిగి ప్రారంభమైంది. ఆ రోజే ఈ అత్యధిక తీర్పులు వెలువడటం గమనార్హం. 19 రోజుల పాటు సెలవుల్లో ఉండటంతో వివిధ అంశాలపై లోతుగా అధ్యయనం చేయటానికి, జడ్జిమెంట్లను రాతపూర్వకంగా ఇవ్వటానికి తీరిక సమయం దొరికిందని జడ్జిలు పేర్కొన్నారు.

ఈ తీర్పుల్లో విదేశాలకు నేరస్తుల అప్పగింతకు సంబంధించిన ఒప్పందాలు, లోకల్‌ చట్టాలు, క్రిమినల్‌ అప్పీల్స్‌, సివిల్‌ సూట్లు, బ్యాంకింగ్‌, బిజినెస్‌ ఇష్యూస్‌, కోర్టు ధిక్కారం, కాంట్రాక్టులు తదితర అంశాలు ఉన్నాయి. కాగా ఈ 44 తీర్పుల్లో 20 తీర్పులను జస్టిస్‌ ఎంఆర్‌షా అనే ఒక్క జడ్జే ఇచ్చారని తెలిపారు. సెలవుల్లో సైతం తమ విలువైన సమయాన్ని కేసుల పరిష్కారం కోసమే కేటాయిస్తున్న న్యాయమూర్తులను మెచ్చుకోవాలని సుప్రీంకోర్టు మాజీ చీఫ్‌ జస్టిస్‌ కేజీ బాలకృష్ణన్ అన్నారు.

తీర్పు చెప్పటం అంత తేలిక కాదని, ఒక్కో కేసు వెనక ఎంతో స్టడీ చేయాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ గతంలో పేర్కొన్నారు. కోర్టు పనివేళలు ముగిశాక ఇంటి దగ్గర సైతం పలువురు న్యాయమూర్తులు కేసులతో కుస్తీలు పడుతుంటారని, సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను పరిశీలిస్తారని, మార్గదర్శకంగా తీసుకుంటారని తెలిపారు. సరైన కసరత్తు చేయకుండా తీర్పు చెబితే విమర్శల పాలయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

కొన్ని కీలక కేసుల్లో(దేశవ్యాప్తంగా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూసేవాటిలో) ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత కూడా న్యాయమూర్తులు జడ్జిమెంట్లను రిజర్వ్‌ చేస్తుంటారు. తీర్పు చెప్పేందుకు సరైన సమయాన్ని, సందర్భాన్ని ఎంచుకుంటారు. అందుకే అవి ఆలస్యమవుతూ ఉంటాయి. అయోధ్యలో రామాలయానికి సంబంధించిన కేసులో తీర్పు చెప్పే ముందు ఆ ప్రాంతంలో పోలీసు బందోబస్తును పటిష్టం చేశారు. డేరా బాబాకు శిక్షను ఖరారు చేస్తూ తీర్పు వెలువరించే ముందు ఆయన అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.