Supreme Court: నిరసనల పేరుతో ఒక ప్రాంతాన్ని నిరవధికంగా ఆక్రమించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిరసనల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించిన ప్రదేశాలకు కూడా నిర్దిష్ట సమయ పరిమితి ఉండాలని వ్యాఖ్యానించింది. గత నెలలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ నిరసనలు, ఇటీవల ప్రతిపక్ష ఇండీ కూటమి రామ్‌లీలా మైదాన్ ర్యాలీల నేపథ్యంలో దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది.
నిరసన తెలిపే హక్కు ఉంది, అయితే దానికి కాలపరిమితి ఉండాలని ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ అన్నారు. కేవలం నిరసన జరుగుతోందన్న కారణంగా ఒక సమూహం బహిరంగ ప్రదేశంలో ఇతరుల రాకపోకల్ని అడ్డుకోకూడదని వ్యాఖ్యానించారు. కాక్రోచ్ జనతా పార్టీ(CJP) జూలై 20న జరిగిన నిరసనకు కేవలం ఒక్క రోజు మాత్రమే అనుమతి ఇచ్చామని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. అయితే, నిరసనకారులు అనుమతించిన సమయం కన్నా ఎక్కువ సమయం, 17 రోజుల పాటు అక్కడే ఉన్నారనే విషయాన్ని కోర్టుకు వెల్లడించారు. పార్లమెంట్ వరకు ర్యాలీగా వెళ్లారని తెలిపారు. పార్లమెంట్, సుప్రీంకోర్టులు సాధారణ రాజకీయ భవనాలు కాదని, మీరు అక్కడికి ర్యాలీగా వెళ్లలేరని మెహతా అన్నారు.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌తో పాటు జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనాలతో కూడిన ధర్మాసనం పలు పిటిషన్లను విచారించింది. వీటిలో వ్యాపార సంఘాలు దాఖలు చేసిన పిటిషన్లతో పాటు నిరసన సందర్భంగా పెద్ద సంఖ్యలో ప్రజల్ని నిర్బంధించడం, పోలీసుల దౌర్జన్యాలు, మెట్రో స్టేషన్ల మూసివేత, ఇంటర్నెట్ నిలిపివేత అంశాలపై పిటిషన్లు దాఖలయ్యాయి.
నిరసనల కారణంగా వ్యాపారానికి నష్టం జరిగిందని వ్యాపార సంఘాలు ఆరోపించాయి. ఈ సమయంలో ఆందోళనలు నిర్వహించిన రాజకీయ పార్టీలను కూడా పిటిషన్‌లో ప్రతివాదులగా చేర్చాలని ధర్మాసనం సూచించింది. వ్యాపారుల తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. నిరసన ప్రాంతానికి సమీపంలో సుమారు 50 లక్షల మంది నివసిస్తున్నారని, ఆందోళన సమయంలో దుకాణాలు మూతపడ్డాయని, కన్నాట్‌ప్లేస్ ప్రాంతంలో జన సంచారం లేదని తెలిపారు.

