Site icon NTV Telugu

Supreme Court: అది ప్రేమ, కామం కాదు.. “పోక్సో కేసు”లో సుప్రీంకోర్టు సంచలన తీర్పు..

Supreme Court

Supreme Court

Supreme Court: పోక్సో(POCSO) కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142ను ఉపయోగించింది. ఒక అమ్మాయి మైనర్‌గా ఉన్నప్పుడు ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకుని, ఆ తర్వాత ఆమెను వివాహం చేసుకునన వ్యక్తిపై పోక్సో చట్టం కింద కేసుల్ని రద్దు చేసింది. ఈ చర్య ఇద్దరి మధ్య కామంతో జరగలేదని ప్రేమ వల్ల జరిగిందని కోర్టు పేర్కొంది. ప్రస్తుతం, ఆ వ్యక్తి భార్య అయిన మహిళతో సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని గడుపుతున్నట్లు కోర్టు గుర్తించింది. ఈ దంపతులకు ఏడాది వయసు ఉన్న కుమారుడు కూడా ఉన్నాడు. మహిళ తండ్రి కూడా ఆమె భర్తపై నేరారోపణల్ని ముగించడానికి సిద్ధంగా ఉన్నట్లు జస్టిస్ దీపాంకర్ దత్తా, ఎజీ మసిహ్‌తో కూడిన ధర్మాసనం గుర్తించింది.

Read Also: Paddy Procurement : రైతులకు శుభవార్త.. నవంబర్ 3 నుంచి ధాన్యం కొనుగోళ్లు

‘‘నేరం అనేది ఒక వ్యక్తిపై మాత్రమే కాకుండా, మొత్తం సమాజంపై జరిగే తప్పు అనే వాస్తవాన్ని మేము గ్రహించాం. అయితే, చట్టం అమలు చేసేటప్పుడు వాస్తవ పరిస్థితులను పక్కన పెట్టకూడదు’’ అని కోర్టు చెప్పింది. ‘‘న్యాయం అందించడానికి సూక్ష్మనైపుణ్య విధానాన్ని కోరుతుంది. సాధ్యమైన చోట వివాదాన్ని ముగించడం సమాజానికి కూడా మంచిది’’ అని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ‘‘చట్ట సభలు చేసిన చట్టాల ప్రకారం, వ్యక్తి దారుణమైన నేరానికి దోషిగా నిర్ధారించబడినందున, రాజీ ఆధారంగా విచారణ రద్దు చేయలేము. కానీ అతడి భార్య కరుణ, సానుభూతి కోసం చేసే విజ్ఞప్తిని విస్మరించడం న్యాయం యొక్క లక్ష్యాలను సాధించదు’’ అని కోర్టు పేర్కొంది. తీవ్రమైన నేరస్తులు కూడా అవసరమైన చోట కరుణకు అర్హులు అని ధర్మాసనం పేర్కొంది.

ఈ కేసులో సంబంధం లైంగిక దోపిడిపై కాకుండా, ప్రేమపై ఆధారపడి ఉందని కోర్టు గుర్తించింది. ఇద్దరు కూడా కుటుంబాన్ని ఏర్పరుచుకున్నారని కోర్టు చెప్పింది. తన భర్తపై నేరస్తుడనే ముద్ర లేకుండా శాంతియుత, స్థిరమైన కుటుంబ జీవితాన్ని గడపాలని బాధితురాలు కోరికను వ్యక్తం చేసిందని, క్రిమినల్ చర్యలు కొనసాగిస్తే అతడిని జైలులో ఉంచితే కుటుంబం దెబ్బతింటుందని, వారి పిల్లలపై ఇది కోలుకోలేని దెబ్బ తీస్తుందని కోర్టు అభిప్రాయపడింది. దీంతో పూర్తి న్యాయం అందించాల్సిన అవసరాన్ని నొక్కిచెబుతూ.. శిక్షను రద్దు చేయడానికి ధర్మాసనం ఆర్టికల్ 142 అనే విచక్షణాధికారాన్ని ఉపయోగించింది. అయితే, భార్య, పిల్లలను విడిచిపెట్టవద్దని, జీవితాంతం వారిని గౌరవంగా కాపాడాలని ఆ వ్యక్తిని కోర్టు ఆదేశించింది. భవిష్యత్తులో ఏదైనా ఇబ్బందుల కలుగచేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. ఈ ఉత్తర్వుల్ని ప్రత్యేక పరిస్థితుల్లో జారీ చేశామని, ఇతర కేసులకు దీనిని ఉదాహరణగా పరిగణించరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Exit mobile version