Supreme Court: ఫామ్ 6, 7, 8లను మార్చలేరు.. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు కీలక సూచనలు..

  • ఢిల్లీ SIRపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
  • ఫామ్ 6,7,8ల నిర్దేశిత నమూనాలను మార్చలేరు..
  • అప్పటికే ఓటర్ల జాబితాలో ఉన్నవారు మళ్లీ ఫామ్-6 ఎందుకు ఇవ్వాలి..
  • పేర్ల నమోదుకు కటాఫ్ తేదీని విధించొద్దు..
Supreme Court

Supreme Court

Supreme Court: ఢిల్లీలో ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)పై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు బుధవారం విచారించింది. ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి లక్షలాది మంది పేర్లను తొలగించే విషయంలో ఎన్నికల సంఘం(EC) తగిన విచక్షణతో వ్యవహరించిందా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఓటర్ల నమోదు కోసం ఉపయోగించే ఫారాలు 6, 7, 8లను ఎన్నికల సంఘం తన ఇష్టానుసారం మార్చలేదని పేర్కొంది. ఇప్పటికే ఓటర్ జాబితాలో పేర్లు ఉన్న వారు నివాసం మారిన సందర్బంతో కొత్త ఓటర్లుగా మళ్లీ ఫామ్ -6 ఎందుకు సమర్పించాల్సి వస్తోందో వివరించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఎన్యూమరేషన్ ఫారాలు అందని వారు, నివాసం మార్చుకున్న వారు తమ పేర్లను తిరిగి ఓటర్ల జాబితాలో చేర్చుకునేందుకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేసే అవకాశం కల్పించాలని ధర్మాసనం సూచించింది. చిరునామా మార్పు కోసం వినియోగించే ఫామ్-8 కూడా ఉపయోగించుకునేలా చూడాలని పేర్కొంది. అక్టోబర్ 30తో ముగియనున్న అభ్యంతరాలు, క్లెయిమ్ గడువును పొడగిస్తామని ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది.

47.57 లక్షల మంది ఓటర్ల పేర్లు తొలగింపు..

ఆగస్టు 31న విడుదలైన ఢిల్లీలో మొత్తం 1.45 కోట్ల మంది ఓటర్లు ఉంటే, ముసాయిదా జాబితాలో 47.57 లక్షల మంది పేర్లను తొలగించారు. వీరిని అందుబాటులో లేని వారిగా, నివాసం మార్చుకున్న వారిగా, మరణించిన వారిగా, ఒకటి లేదా ఎక్కువ సార్లు నమోదైన వారిగా వర్గీకరించారు. మొదట సెప్టెంబర్ 30తో ముగియాల్సిన క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ గడువును తర్వాత అక్టోబర్ 30 వరకు పొడిగించారు.

అక్టోబర్ 26 నాటికి, మ్యాపింగ్ సమస్యలు, ఇతర వ్యత్యాసాలకు సంబంధించి జారీ చేసిన 33.14 లక్షల నోటీసుల్లో 31.26 లక్షల కేసులను ఎన్నికల సంఘం పరిష్కరించింది. ఇదే సమయంలో తార్కిక వ్యత్యాసాలు ఉన్నాయని గుర్తించిన 19.34 లక్షల కేసుల్లో 18.97 లక్షల కేసులపై చర్యలు పూర్తి చేసినట్లు తెలిపింది. ఇదే సమయంలో ఫారం-6 కింద 2.67 లక్షల దరఖాస్తులు, ఫారం-7 కింద 20,074 అభ్యంతరాలు, ఫారం-8 కింద 1.01 లక్షల దరఖాస్తులు అందాయి. తుది ఓటర్ల జాబితాను డిసెంబర్ 4న విడుదల చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.

సుప్రీంకోర్టు కీలక ప్రశ్నలు..

విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఎన్నికలసంఘాన్ని కీలక ప్రశ్నలు అడిగింది. బూత్ లెవల్ అధికారులు(బీఎల్ఓలు) ఎన్యూమరేషన్ ఫారాలు అందించే సమయంలో ఇంట్లో లేని ఓటర్ల పరిస్థితిపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. నిర్ణీత గడువులో ఫామ్ సమర్పించకపోయినంత మాత్రాన ఒక వ్యక్తిని ఓటర్ల జాబితాలో తిరిగి పేరు నమోదు చేసుకునే హక్కును నిరాకరించవచ్చా? అని ప్రశ్నించింది. గడువులోగా ఎన్యూమరేషన్ ఫారం తిరిగి ఇవ్వపోయిన ఓటర్లకు ఎన్నికల జాబితాలో మళ్లీ చేరే అవకాశం నిరాకరించడం సమంజసం కాదని సుప్రీం వ్యాఖ్యానించింది.

2026 ఓటర్ల జాబితాలో ఇప్పటికే పేరు ఉండి, ఆ తర్వాత నివాసం మార్చుకున్న వ్యక్తిని కొత్త ఓటరుగా పరిగణించి ఫారం-6 సమర్పించాలని ఎందుకు కోరుతున్నారని ధర్మాసనం ఎన్నికల సంఘాన్ని నిలదీసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ, ఒక నియోజకవర్గంలో లేదా మరో నియోజకవర్గానికి నివాసం మార్చుకున్నవారు చిరునామా మార్పు కోసం ఉద్దేశించిన ఫారం-8ను ఎందుకు ఉపయోగించకూడదో వివరించాలని కోరారు. ఫారం-6, ఫారం-7, ఫారం-8లను చట్టం ప్రకారం నిర్దేశించారని, వాటి స్వరూపాన్ని మార్చడం సాధ్యం కాదని జస్టిస్ బాగ్చి పేర్కొన్నారు. నిర్ణీత సమయంలో ఎన్యూమరేషన్ ఫారాలు ఎందుకు సమర్పించలేకపోయారే కారణాలను ఓటర్లను నుంచి తీసుకునే మార్గాన్ని ఎన్నికల సంఘం పరిశీలించవచ్చని సూచించింది.