Supreme Court: పరీక్షా సంస్కరణలపై సుప్రీంకోర్టు విచారణ.. ఎన్‌టీఏ ఆఫీస్‌ను సందర్శించే అవకాశం

  • పరీక్షా సంస్కరణలపై సుప్రీంకోర్టు విచారణ
  • ఎన్‌టీఏకు ప్రత్యేక శాశ్వత భవనం ఉందని సమాచారం
  • ఎన్‌టీఏ ఆఫీస్‌ను సందర్శించే అవకాశం
Supremecourt

Supremecourt

ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని నేతృత్వంలోని పరీక్షా సంస్కరణలపై సుప్రీంకోర్టు సమీక్షించింది. పురోగతిపై నివేదిక కోరుతూ సుప్రీంకోర్టు ఎన్‌టీఏ కార్యాలయాన్ని సందర్శించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్‌టీఏలో నిర్మాణాత్మక మార్పులు, పరీక్షా విధానంలో సంస్కరణలు కోరుతూ దాఖలైన పలు పిటిషన్లపై జస్టిస్‌లు పి.ఎస్. నరసింహ, అలోక్ అరధేలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. న్యూఢిల్లీలోని మింటో రోడ్ సమీపంలో ఎన్‌టీఏకు ఇప్పుడు ఒక ప్రత్యేక శాశ్వత భవనం ఉందని కోర్టుకు తెలియజేశారు.

పరీక్షా సంస్కరణలపై కమిటీలు సిఫార్సులు చేయడం మాత్రమే కాకుండా.. వాటిని సంస్థాగతంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని కోర్టు స్పష్టం చేసింది. కోర్టు ముందు ఉంచిన నివేదికల ప్రకారం.. నందన్ నీలేకని నేతృత్వంలోని టాస్క్‌ఫోర్స్, డాక్టర్ కే. రాధాకృష్ణన్ నేతృత్వంలోని హై-లెవల్ కమిటీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్‌తో విస్తృతంగా సంప్రదింపులు జరిపింది. నీలేకని కమిటీ సెప్టెంబర్ చివరి నాటికి తన నివేదికను సమర్పించే అవకాశం ఉందని సొలిసిటర్ జనరల్ కోర్టుకు తెలిపారు. అయితే కేవలం సిఫార్సులు చేయడంతో ప్రక్రియ పూర్తికాదని.. సంస్కరణలు వాస్తవంగా అమలులోకి రావాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

గతంలో రాధాకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికను ప్రస్తావించిన కోర్టు.. కేవలం కమిటీ నివేదిక ఉండటం సరిపోదని.. అందులోని సిఫార్సులను పరిశీలించి అమలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో సిబ్బంది, శిక్షణ విభాగం జాయింట్ సెక్రటరీ.. హై-పవర్డ్ కమిటీతో సమన్వయం చేసుకుంటూ ఇప్పటివరకు చేపట్టిన చర్యలు, సాధించిన పురోగతిపై అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇందుకు రెండు వారాల గడువు ఇచ్చింది. ఈ కేసును మూడు వారాల తర్వాత తిరిగి విచారణకు తీసుకోనుంది.

NTA కూడా తన అఫిడవిట్‌ను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలని కూడా కోర్టు ఆదేశించింది. తద్వారా విద్యార్థులు, ఇతర సంబంధిత వర్గాలు సంస్కరణల పురోగతిని తెలుసుకునే అవకాశం ఉంటుందని చెప్పింది. NTA సమర్పించిన అఫిడవిట్ ప్రకారం.. ప్రస్తుతం పరీక్షల వారీగా పనిచేసే యూనిట్ల నుంచి ఫంక్షనల్ వర్టికల్ నిర్మాణానికి సంస్థ మారుతోంది. కీలక కార్యకలాపాల కోసం ప్రత్యేక నైపుణ్యాలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపింది.

నాయకత్వ మార్పులు

NTA నాయకత్వాన్ని కూడా బలోపేతం చేసినట్లు అఫిడవిట్‌లో పేర్కొంది. సెక్రటరీ స్థాయి డైరెక్టర్ జనరల్‌ను నియమించడంతో పాటు, కేడర్ స్థాయి అధికారులు, భద్రత, మానవ వనరులు, పరిశోధన-అభివృద్ధి విభాగాల్లో నిపుణులను ఓపెన్ మార్కెట్ నియామకాల ద్వారా తీసుకున్నట్లు వెల్లడించింది. NTA నాయకత్వంలో IAS, IPS, ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్‌కు చెందిన అధికారులు ఉన్నట్లు తెలిపింది.

పరీక్షలకు సంబంధించిన అత్యంత రహస్య సమాచారాన్ని నిర్వహించే కార్యాలయాలను మింటో రోడ్‌లోని ప్రత్యేక ప్రభుత్వ భవనానికి తరలించినట్లు NTA తెలిపింది. 55,520 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఈ కేంద్రానికి 39 మంది CISF సిబ్బందితో భద్రత కల్పిస్తున్నట్లు పేర్కొంది. అలాగే అక్కడ ఎక్స్‌రే స్క్రీనింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు అఫిడవిట్‌లో వెల్లడించింది.