దేశ వ్యాప్తంగా నెలకొన్న కుక్కల బెడదపై సుప్రీంకోర్టు మరోసారి సీరియస్ అయింది. ఇటీవల కుక్కల సమస్యపై సుప్రీం ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అంతర్జాతీయంగా భారతదేశ గౌరవం డ్యామేజ్ అవుతున్నా మేలుకోరా? అంటూ వ్యాఖ్యానించింది. తాజాగా ఇదే అంశంపై న్యాయస్థానం.. చీఫ్ సెక్రటరీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. చీఫ్ సెక్రటరీలు సోమవారం ధర్మాసనం ముందు ఫిజికల్‌గా హాజరు కావాల్సిందేనని సూచించింది. ఒకవేళ వ్యక్తిగతంగా హాజరుకాకపోతే తగిన చర్యలు తీసుకుంటామని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఈ మేరకు జస్టిస్ విక్రమ్ నాథ్, సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం వార్నింగ్ ఇచ్చింది.
ఇది కూడా చదవండి: Supreme Court: దర్యాప్తు సంస్థల తీరుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
వీధి కుక్కల కేసు విచారణకు తెలంగాణ, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ మినహా ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలు ఎందుకు హాజరుకావడం లేదని సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఈ సందర్భంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలు ఫిజికల్‌గా హాజరు కావాల్సిందేనంటూ నోటీసులు జారీ చేసింది. అయితే వర్చువల్‌గా కోర్టు ముందు హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలంటూ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరారు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చేసిన విజ్ఞప్తిని సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది. తుషార్ మెహతా అభ్యర్థనను జస్టిస్ విక్రమ్ నాథ్, సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం తిరస్కరించింది. కచ్చితంగా సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు హాజరుకావాల్సిందేనని ఆదేశాలు ఇచ్చింది.
ఇది కూడా చదవండి: PM Modi: నెహ్రూ వల్లే ఆ సమస్య వచ్చింది.. కాంగ్రెస్‌పై మండిపడ్డ మోడీ
ఇది చాలా దురదృష్టకరం.. మున్సిపల్ కార్పొరేషన్లు, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాల్సిన సమస్యలతో కోర్టు సమయం వృథా అవుతోందని న్యాయస్థానం ఆవేదన వ్యక్తం చేసింది. ‘‘పార్లమెంట్ నిబంధనలు చేస్తుంది.. కానీ ఎటువంటి చర్యలు ఉండవు. మేము కంప్లయన్స్ అఫిడవిట్లు ఫైల్ చేయమని ఆదేశిస్తే.. వారు దానిని పట్టించుకోవడం లేదు. కోర్టు ఆదేశాలకు గౌరవం లేదు. వాళ్లు భౌతికంగా వచ్చి ఎందుకు కంప్లయన్స్ అఫిడవిట్లు దాఖలు చేయలేదో చెప్పాలి.’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇక విధి కుక్కల కేసులో యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ అమలుపై కోర్టు ఇచ్చిన గడువులోగా తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ అఫిడవిట్ దాఖలు చేశాయి. మిగతా రాష్ట్రాలు చేయకపోవడంపై తాజాగా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
