NTV Telugu Site icon

Supreme Court: ఉక్రెయిన్ విద్యార్థుల మెడికల్ ఎడ్యుకేషన్‌పై ఇవాళ సుప్రీంలో విచారణ

Supreme Court

Supreme Court

Supreme Court: రష్యా- ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఆ దేశాన్ని వదిలిపెట్టి ఇండియాకు చేరుకున్న వైద్య విద్యార్థుల కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. విద్యార్థులు ఇండియాలోని వైద్య కళాశాల్లో అడ్మిషన్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నారు. ఉక్రెయిన్ విద్యార్థుల మెడికల్ ఎడ్యుకేషన్‌పై ఇవాళ సుప్రీంలో విచారణ జరగనుంది. రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం వల్ల వైద్య విద్యార్థులు భారత్‌కు తిరిగి వచ్చారు. భారత్‌లోని మెడికల్ కాలేజీల్లో తదుపరి చదువును కొనసాగించేలా అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టును విద్యార్థుల తల్లిదండ్రులు ఆశ్రయించారు.

అయితే తాజాగా ఈ విషయంపై కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన వైద్య విద్యార్థులకు దేశంలోని వైద్య కళాశాలల్లో ప్రవేశం పొందడం చట్టపరంగా సాధ్యం కాదని కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. జాతీయ వైద్య మండలి నిబంధనల ప్రకారం వైద్య విద్యార్థులకు భారత్‌లో ప్రవేశం కల్పించటం సాధ్యం కాదని కేంద్రం చెప్పింది. నీట్ పరీక్షలో తక్కువ మార్కులు రావడంతోనే విద్యార్థులు ఉక్రెయిన్‌లో మెడిసిన్ చదివేందుకు వెళ్లారని కేంద్రం వెల్లడించింది. దీంతో వీరికి ఇక్కడ ప్రవేశాలు చట్టబద్ధం కావని తేల్చి చెప్పింది కేంద్రం. అయితే ఉక్రెయిన్ కళాశాల అనుమతితో ఇతర దేశాల్లో డిగ్రీని పూర్తి చేసేందుకు అవకాశం కల్పిస్తామని అఫిడవిట్‌లో పేర్కొంది.

Bihar Thief: కదులుతున్న రైలులో చోరీకి యత్నం.. చుక్కలు చూపించిన ప్రయాణికులు

ఉక్రెయిన్ నుండి తిరిగి వచ్చే విద్యార్థులకు సహాయం చేయడానికి భారత ప్రభుత్వం, దేశంలోని అపెక్స్ మెడికల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ బాడీ, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎంసీ)తో సంప్రదించి తగిన చర్యలు చేపట్టినట్లు కోర్టుకు తెలిపింది కేంద్రం. స్వదేశానికి తిరిగి వచ్చిన విద్యార్థులను దేశంలోని మెడికల్ కాలేజీలకు బదిలీ చేయడంతోపాటు… ఈ విషయంలో చేసే సడలింపులు అన్నీ మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా చట్టం, నేషనల్ మెడికల్ కమిషన్ చట్టాలకు అనుగుణంగానే జరుగుతాయని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. వైద్య విద్యార్థులకు భారత్‌లో ప్రవేశాలు కల్పించలేం అంటూ సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. కేంద్రప్రభుత్వ అఫిడవిట్‌తో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు.

Show comments