Site icon NTV Telugu

Supreme Court: పైలట్లను నిందించొద్దు.. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై కీలక సూచన

Supreme Court1

Supreme Court1

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత పైలట్లపై అనేక ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా అంతర్జాతీయ మీడియాలో లేనిపోని కథనాలు ప్రచురించాయి. పైలట్ ఆత్మహత్య కారణంగానే ఎయిరిండియా విమాన ప్రమాదం జరిగిందంటూ కథనాలు ప్రచురించాయి. అయితే కథనాలను పైలట్ల సంఘాలు తీవ్రంగా ఖండించాయి.

ఇది కూడా చదవండి: PM Modi: వందేమాతరం ఒక శక్తి.. నవంబర్ 7 చారిత్రాత్మక రోజు అన్న మోడీ

తాజాగా ఇదే అంశంపై పైలట్ సుమీత్ సబర్వాల్ తండ్రి పుష్కర్ సబర్వాల్(91) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై స్వతంత్ర దర్యాప్తు చేయాలని.. తన కొడుకుపై వస్తున్న నిందలు ఈ వయసులో తట్టుకోలేకపోతున్నట్లు పిటిషన్‌లో వాపోయాడు. శుక్రవారం పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం కీలక ఆదేశాలు ఇచ్చింది. నివేదిక రాకుండా పైలట్‌ను ఎలా నిందిస్తారని తప్పుపట్టింది. వృద్ధ వయసులో ఈ భారాన్ని మోయొద్దని.. ఇందులో మీ కుమారుడు తప్పు లేదని న్యాయస్థానం సూచించింది. తుది నివేదిక వచ్చేంత వరకు పైలట్‌ను ఎవరూ నిందించొద్దని పేర్కొంది. ఈ మేరకు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: Supreme Court: వీధి కుక్కల బెడదపై మరోసారి సుప్రీంకోర్టు సంచలన తీర్పు

అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరగడం చాలా దురదృష్టకరమని.. మీ కొడుకును నిందించే భారాన్ని మీరు మోయకూడదని.. వృద్ధ పిటిషనర్‌కు జస్టిస్ సూర్యకాంత్ సూచించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేసింది. ప్రాథమిక రిపోర్టులో ఇద్దరు పైలట్ల సంభాషణ మాత్రమే రికార్డైంది. దానిని బట్టి ఎవరినీ నిందించొద్దని జస్టిస్ బాగ్చి అన్నారు. పత్రికల్లో వచ్చే ఆరోపణలను పట్టించుకోవద్దని.. ఒకవేళ దావా వేయాలంటే వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రికపై వేయాలని సూచించారు. ఈ విషాదానికి కారణం ఏదైనా కావచ్చు.. కానీ పైలట్ కారణం కాదని జస్టిస్ సూర్యకాంత్ పిటిషనర్‌తో అన్నారు. తదుపరి విచారణ నవంబర్ 10కు ధర్మాసనం వాయిదా వేసింది.

జూన్ 13న అహ్మదాబాద్ నుంచి లండన్‌కు ఎయిరిండియా బయల్దేంది. టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే సమీపంలో ఉన్న మెడికోల హాస్టల్‌పై కూలిపోయింది. దీంతో విమానంలో ఉన్న ఒక్కరు తప్ప.. అందరూ చనిపోయారు. అలాగే హాస్టల్‌లో ఉన్న పలువురు మెడికోలు కూడా మృతిచెందారు. ఇలా మొత్తంగా 270 మంది చనిపోయారు. అనంతరం మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున ఎయిరిండియా నష్టపరిహారం ప్రకటించింది. అయితే ఈ ప్రమాదంపై రెండు దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్నాయి. ఇంతలోనే అంతర్జాతీయ మీడియా తప్పుడు కథనాలు ప్రచురించింది. పైలట్ ఆత్మహత్య వల్లే ప్రమాదం జరిగిందంటూ కథనాలు ప్రచురించాయి. ఈ కథనాలపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. ఇక తుది నివేదిక ఈ ఏడాది చివరి నాటికి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Exit mobile version