Site icon NTV Telugu

Supreme Court: కుక్కల మీద ఉన్న ప్రేమ.. మనుషులపై ఎందుకు లేదు.. జంతు ప్రేమికులకు సూటిప్రశ్న

Supreme Court1

Supreme Court1

వీధి కుక్కల బెడదపై మరోసారి దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు చేసింది. కుక్కల మీద ఉన్న ప్రేమ.. మనుషులపై ఎందుకు లేదని నిలదీసింది. కుక్కల బెడదపై ఇప్పటికే సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆయా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాల్సిందేనని సూచించారు. తాజాగా మంగళవారం కూడా మరొక సారి సుప్రీం ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా జంతు ప్రేమికులపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.

‘మీకు కుక్కల పట్ల మాత్రమే సానుభూతి ఉందా?, మనుషుల పట్ల లేదా?, కుక్కల దాడిలో చిన్న పిల్లలు, వృద్ధులు చచ్చిపోతుంటే బాధ్యత లేదా? బహిరంగ ప్రదేశాల్లో కుక్కలకు ఆహారం పెడతారా?, ఇదేం పద్ధతి? పౌరుడు చనిపోతుంటే.. తీవ్రంగా గాయపడుతుంటే.. మానవత్వం లేదా?, మీకు కరుణ కుక్కల వరకే పరిమితమైందా? మనుషులపై కాదా? 9 ఏళ్ల బాలిక వీధి కుక్కల దాడిలో చనిపోతే ఎవరు బాధ్యత వహిస్తారు? ఇకపై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఆహారం ఇచ్చే వారు కూడా బాధ్యత వహించాల్సిందే.’’ అని జంతు ప్రేమికులకు సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది.

బహిరంగ ప్రదేశాల్లో కుక్కలకు ఆహారం పెట్టే వారిని.. వాటికి మద్దతు ఇచ్చే సంస్థలను జవాబుదారీగా ఎందుకు ఉంచకూడదని న్యాయస్థానం ప్రశ్నించింది. ప్రతి కుక్క కాటుకు.. మరణం లేదా తీవ్రంగా గాయపడితే రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఆయా సంస్థలు బాధ్యత వహించాల్సిందేనని హెచ్చరించింది. ఈ సమస్యను పరిష్కరించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైతే మాత్రం భారీ జరిమానా ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు జస్టిస్ విక్రమ్ నాథ్, సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. కచ్చితంగా బహిరంగ ప్రదేశాల్లో ఆహారం పెట్టే వారిని జవాబుదారీగా ఉంచుతామని ధర్మాసనం తేల్చి చెప్పింది.

గతేడాది నవంబర్ 7న సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. విద్యాసంస్థలు, ఆస్పతులు, రైల్వే స్టేషన్లలో కుక్క కాటులపై ఆందోళన వ్యక్తం చేసింది. ఆ ప్రాంతాల్లో కుక్కల బెడద లేకుండా చూడాలని ఆదేశించింది. స్టెరిలైజేషన్, టీకాల తర్వాత షెల్టర్లకు తరలించాలని ఆదేశించింది. తిరిగి పట్టుకున్న స్థలాల్లో విడిచి పెట్టొద్దని ముగ్గురు న్యాయమూర్తుల ప్రత్యేక ధర్మాసనం పేర్కొంది. అలాగే రాష్ట్ర రహదారులు, జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేల నుంచి అన్ని పశువులు, ఇతర వీధి జంతువులను తొలగించేలా చూడాలని ధర్మాసనం అధికారులను ఆదేశించింది.

అంతేకాకుండా గతేడాది జూలైలో కూడా ఇలాంటి కీలక ఆదేశాలు ఇచ్చింది. ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో వీధి కుక్కలు లేకుండా షెల్టర్లకు తరలించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. కుక్క కాటు కారణంగా ఒక్క రేబిస్ మరణం జరగకూడదని తెలిపింది. అడ్డుకునేవారిపై కఠిన చర్యలు కూడా తీసుకోవాలని ఆదేశించింది. అలాగే వీధి కుక్కలకు ఆహారం పెట్టడానికి ప్రత్యేక దాణా స్థలాన్ని ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులను కోర్టు ఆదేశించింది. బహిరంగంగా ఆహారం ఇవ్వడానికి అనుమతించబడదని.. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది. ఇదే మాదిరిగా ఢిల్లీ హైకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. అయితే జంతు ప్రేమికులు న్యాయస్థానాల ఆదేశాలపై ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేశారు.

Exit mobile version