ED vs TMC Govt: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మధ్య పంచాయతీ సుప్రీంకోర్టుకు చేరింది. ఈ సందర్భంగా మమతా, ఈడీ లాయర్ల మధ్య తీవ్ర వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. ఈడీ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించగా, మమతా బెనర్జీ తరపున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ సింఘ్వీ, కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ ప్రభుత్వంపై ఈడీ సంచలన ఆరోపణలు చేసింది.
Read Also: Ahmedabad plane crash: పైలట్ మేనల్లుడికి నోటీసులు.. మండిపడుతున్న పైలట్ సంఘాలు
ఈడీ తరపున అడ్వకేట్ మాట్లాడుతూ.. తమ అధికారుల ఫోన్లు, కీలక డాక్యుమెంట్లను మమతా బెనర్జీతో పాటు బెంగాల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. ఐ-ప్యాక్ కార్యాలయానికి మమతా బెనర్జీ వెళ్లాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. అలాగే, బెంగాల్ పోలీసులు సీసీటీవీ ఫుటేజీని ధ్వంసం చేశారని, కోల్‌కతా హైకోర్టులో తమ న్యాయవాదిని వాదించకుండా అడ్డుకున్నారని పేర్కొన్నారు. హైకోర్టులో తమ లాయర్ మైక్‌ను కూడా కట్ చేశారని ఎస్జీ తుషార్ మెహతా ఆరోపించారు. మమతా బెనర్జీ ఒక ప్రణాళిక ప్రకారమే ఈ కథను నడిపిస్తున్నారు.. హైకోర్టుకు బస్సులు ఏర్పాటు చేసి మరీ జనాలను తరలించారని ఈడీ ఆరోపించింది. ఇక, హైకోర్టును జంతర్‌మంతర్‌లా మార్చారా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇది చాలా సీరియస్ మ్యాటర్ పేర్కొన్న న్యాయస్థానం.. దీనిపై సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. కేసు మొత్తాన్ని పూర్తిగా పరిశీలించాలని ఆదేశించింది.
Read Also: CM Chandrababu: సంక్రాంతి సందడి- ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా ప్రభుత్వం చర్యలు
ఇక, మమతా బెనర్జీ తరపు న్యాయవాదులు ఈడీ చర్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సోదాలు చేయడానికి రెండు సంవత్సరాలు ఎందుకు ఎదురు చూశారు.. ఎన్నికల ముందే తనిఖీలు చేయాల్సిన అవసరం ఏమిటని క్వశ్చన్ చేశారు. సరిగ్గా ఎన్నికల ముందే హడావిడి చేయడం ఎందుకని ప్రశ్నించారు. ఈడీ పక్షపాత ధోరణిని అవలంభిస్తుందని ఆరోపించారు. ఐ-ప్యాక్ కార్యాలయంలో ఎన్నికల మెటీరియల్ ఉంటుందని ఈడీకి ముందే తెలుసని, అయినా సోదాల్లో ఏమీ దొరకలేదని ఈడీ పంచనామాలోనే రాసిందని సుప్రీంకోర్టులో మమతా బెనర్జీ లాయర్లు తెలిపారు. కాగా, మా పార్టీకి సంబంధించిన డివైజ్‌లను మాత్రమే తీసుకున్నాం.. పార్టీ ఎన్నికల వ్యూహాలను లీక్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. కాగా, ముఖ్యమంత్రికి జెడ్ ప్లస్ భద్రత ఉందని, ఆమె వెంట ఎప్పుడూ పోలీసు సిబ్బంది ఉంటారని మమతా తరపు లాయర్లు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.