ఈ మధ్య భారతదేశంలో వరకట్న వేధింపులతో ఎందరో అబలలు ప్రాణాలు కోల్పోతున్నారు. తెలుగు హీరోయిన్ ట్విషా శర్మ దగ్గర నుంచి ఎందరో వివాహితులు అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. ఈ ఘటనలు యావత్తు దేశాన్ని కలవరపాటుకు గురి చేస్తుండగా.. కన్నవారికి వేదన మిగులుస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనలోనే దేశ సర్వోన్నత న్యాయస్థానం ఓ నిందితుడి కుటుంబానికి చీవాట్లు పెట్టింది. ప్రస్తుతం సుప్రీం కోర్టు వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ వరకట్న కేసును శుక్రవారం సుప్రీంకోర్టు విచారించింది. పెళ్లైన మూడేళ్లలోపే మహిళ అత్తగారింట్లో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. భర్త, అతని కుటుంబ సభ్యులు నిరంతరం వరకట్నం వేధింపులకు గురి చేసి.. మానసికంగా వేధించడంతో ప్రాణాలు తీసుకుంది. దీంతో ఈ కేసులో ట్రయల్ కోర్టు నిందితులకు శిక్ష విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును బీవీ. నాగారత్న, ఉజ్జల్ భూయాన్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా నిందితుడి కుటుంబానికి న్యాయస్థానం చీవాట్లు పెట్టింది.
‘‘అబ్బాయిలు పెళ్లిళ్లు ఎందుకు చేసుకుంటారు?, వరకట్నం పేరుతో వరుడి తరఫు వారు వధువుపైనా, ఆమె కుటుంబంపైనా ఒత్తిడి తెస్తారా?. వధువును, ఆమె కుటుంబాన్ని పీడించడమే లక్ష్యమా?, వధువు, ఆమె కుటుంబంపై వరకట్న వేధింపులు, అవమానాలను తక్షణమే అంతం కావాలి. వరకట్నం డిమాండ్లు, ఆర్థిక ఒత్తిడి కారణంగా వధువు కుటుంబం అవమానానికి గురికావడమే లక్ష్యమా.’’ అంటూ జస్టిస్ నాగారాత్న తీవ్రంగా మండిపడ్డారు. ఈ సందర్భంగా భర్త తమ్ముడికి విధించిన శిక్షను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేస్తూ.. దిగువ కోర్టు నిర్ణయాన్ని సమర్థించింది.
ఈ కేసులో ట్రయల్ కోర్టు.. ఆ తర్వాత ఛత్తీస్‌గఢ్ హైకోర్టు భర్త కుటుంబంలోని పలువురిని ఐపీసీలోని సెక్షన్లు 304బి (వరకట్నం మరణం), 306 (ఆత్మహత్యకు ప్రేరేపించడం) మరియు 498ఎ (క్రూరత్వం, వేధింపులు) కింద దోషులుగా నిర్ధారించాయి. అయితే భర్త తమ్ముడు సెక్షన్ 498A కింద మాత్రమే అతని శిక్షను సవాలు చేశాడు. కానీ కోర్టు ఉపశమనం కల్పించడానికి నిరాకరించింది. జస్టిస్ నాగారత్న మాట్లాడుతూ.. ‘‘సెక్షన్ 498A మాత్రమే వర్తిస్తుందని.. శిక్ష కేవలం మూడేళ్లేనని మీరు సంతోషించాలి” అని అన్నారు.
