Gyanvapi Mosque Case: జ్ఞానవాపి మసీదు కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మసీదులో లభించిన శివలింగానికి శాస్త్రీయ సర్వే, కార్బన్ డేటింగ్ చేయడానికి మే 12న అలహాబాద్ హైకోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. అయితే దీనిపై ఇంతేజామియా మసీద్ కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ రోజు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు శాస్త్రీయ సర్వేను వాయిదా వేయాలని తీర్పు చెప్పింది. ‘‘ఈ విషయంలో మనం జాగ్రత్తగా నడవాలి’’ అని కీలక వ్యాఖ్యలు చేసింది.
Read Also: Sunrisers Fans : సన్‌రైజర్స్ హైదరాబాద్ కోచ్ గా యువరాజ్ సింగ్‌ని తీసుకు రండి..?
హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ లోని చిక్కులను నిశితంగా పరిశించాల్సిన అవసరం ఉందని ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం శాస్త్రీయ సర్వే, కార్బన్ డేటింగ్ ప్రక్రియను నిలిపివేశాయి. అలహాబాద్ హైకోర్ట్ ఇచ్చిన ఆర్డర్, తర్వాత విచారణ తేదీ వరకు వాయిదా వేయాలని ఆదేశాలు ఇచ్చింది. శివలింగం శాస్త్రీయ సర్వేను ప్రస్తుతానికి వాయిదా వేయడానికి కేంద్రం, ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం, హిందూ పిటిషనర్లకు నోటీసులు జారీ చేసింది. శివలింగం శాస్త్రీయ సర్వేను ప్రస్తుతానికి వాయిదా వేయడానికి కేంద్ర, ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం రెండూ అంగీకరించాయి.
గతేడాది నుంచి వారణాసిలోని జ్ఞానవాపి మసీదు వార్తల్లో నిలుస్తోంది. వారణాసిలోని దిగువ కోర్టు గతేడాది మసీదు వీడియో సర్వేకు ఆదేశాలు ఇచ్చింది. ఆ వీడియో సర్వేలో భాగంగా మసీదులోని వాజుఖానాలోని కొలనులో శివలింగం వంటి నిర్మాణం బయటపడింది. అయితే హిందువులు దీన్ని శివలింగంగా భావిస్తుంటే, ముస్లింపక్షం మాత్రం ఇది ఫౌంటెన్ అని చెబుతోంది. మసీదు కూడా కాశీవిశ్వనాథ కాంప్లెక్స్ లో భాగమే అని మసీదు గోడలపై దేవతా మూర్తుల విగ్రహాలు ఉన్నాయని.. తమకు పూజ చేసుకునే అవకాశం కల్పించాలని కోర్టును ఐదుగురు మహిళలు కోరడంతో జ్ఞానవాపి మసీదు వివాదం తెరపైకి వచ్చింది. దీనికి మసీదు కమిటీ వ్యతిరేకిస్తోంది.