కాక్రోచ్ జనతా పార్టీ వివాదంపై దాఖలైన పిటిషన్లను అత్యవసరంగా విచారించాలన్న అభ్యర్థనను భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ సోమవారం తిరస్కరించారు. “దీనిని అంత సెంటిమెంట్‌గా తీసుకోకండి” అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంలో అంత అత్యవసరం ఏమీ లేదని, పిటిషన్లను తగిన సమయంలో విచారిస్తామని తోసిపుచ్చారు.
సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా అడ్వకేట్ ఎన్‌కే గోస్వామి మాట్లాడుతూ.. సీజేఐ చేసిన పూర్వ వ్యాఖ్యలపై ఇప్పటికే వివరణ ఇచ్చినా.. సోషల్ మీడియాలో ఇప్పటికీ వక్రీకృత ప్రచారం జరుగుతోందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించిన సీజేఐ సూర్యకాంత్.. “ఇది అంత తీవ్రమైన అత్యవసర అంశం కాదు. సరైన సమయంలో విచారణకు తీసుకుంటాం” అని పేర్కొన్నారు. ఈ వివాదానికి కారణం మే 15న జరిగిన ఓ విచారణలో సీజేఐ చేసిన వ్యాఖ్యలే. “వ్యవస్థపై దాడులు చేసే కొందరు యువకులు ఉద్యోగాలు లేక.. వృత్తుల్లో స్థానం లేక కాక్రాచ్‌లలా మారుతున్నారు. కొందరు మీడియా, సోషల్ మీడియా, ఆర్టీఐ కార్యకర్తలుగా మారి అందరినీ విమర్శించడం ప్రారంభిస్తున్నారు” అని వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. అనంతరం “కాక్రోచ్ జనతా పార్టీ” పేరుతో వ్యంగ్య ఉద్యమం ప్రారంభమైంది. నిరుద్యోగం, పరీక్షల పేపర్ లీకులు, పాలన వైఫల్యాలపై మీమ్స్, పోస్టులతో ఈ ఉద్యమం వైరల్ అయింది. విమర్శలు పెరగడంతో సీజేఐ తర్వాత వివరణ ఇచ్చారు. “నేను దేశ యువతను విమర్శించలేదు. నకిలీ డిగ్రీలతో న్యాయవృత్తిలోకి వచ్చిన వారినే ఉద్దేశించి మాట్లాడాను” అని స్పష్టం చేశారు.
ఇదే వివాదానికి సంబంధించిన మరో పిటిషన్ కూడా సోమవారం కోర్టు ముందుకు వచ్చింది. కోర్టు మౌఖిక వ్యాఖ్యలను డబ్బు ఆర్జనకు ఉపయోగించకుండా చర్యలు తీసుకోవాలని, నకిలీ న్యాయవాదులపై దర్యాప్తు జరపాలని ఆ పిటిషన్‌లో కోరారు. అయితే ఆ పిటిషన్‌ను కూడా అత్యవసరంగా విచారించేందుకు బెంచ్ నిరాకరించింది.
మీడియా కథనాల ప్రకారం.. “కాక్రోచ్ జనతా పార్టీ” ఉద్యమాన్ని మహారాష్ట్రకు చెందిన అభిజీత్ దిప్కే అనే యువకుడు ప్రారంభించాడు. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న అతడు ప్రారంభించిన సోషల్ మీడియా ఖాతాలు కొన్ని రోజుల్లోనే లక్షలాది ఫాలోవర్లను సంపాదించాయి. అనంతరం ఆ ఖాతాల్లో కొన్ని భారత్‌లో నిలిపివేయబడ్డాయి. జాతీయ భద్రతా అంశాలపై వచ్చిన ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఆదేశాలతో ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఇక తన సోషల్ మీడియా ఖాతాలు, వెబ్‌సైట్ హ్యాక్ చేయబడ్డాయని అభిజీత్ దిప్కే ఆరోపించాడు.
ఈ వివాదం నేపథ్యంలో మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌లో ఉన్న దిప్కే నివాసానికి పోలీసులు భద్రత కల్పించారు. సోషల్ మీడియాలో ఈ అంశం తీవ్రంగా ట్రెండ్ అవుతుండటంతో ఎలాంటి గుంపులు చేరకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా రౌండ్ ది క్లాక్ భద్రత ఏర్పాటు చేసినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ పంకజ్ అతుల్కర్ తెలిపారు. ఇది ఎలాంటి ప్రత్యేక బెదిరింపుల కారణంగా కాదని స్పష్టం చేశారు.
