NTV Telugu Site icon

Waqf Board: 50 ఏళ్ల నివాస ప్రాంతానికి వక్ఫ్ బోర్డు నోటీసులు.. 30 రోజుల్లో ఖాళీ చేయాలని హుకూం..

Woqf Board

Woqf Board

Waqf Board: ఇటీవల వక్ఫ్ చట్ట సవరణ బిల్లుని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. వక్ఫ్ బోర్డు అపరిమిత అధికారాలకు కళ్లెం వేయడానికి ఈ వక్ఫ్ బిల్లును ప్రవేశపెట్టింది. ఇందులోని నియమాలను సంస్కరించడానికి ఈ బిల్లుని తీసుకువచ్చినట్లు కేంద్ర ప్రకటించింది. అయితే, దీనిని కాంగ్రెస్‌తో పాటు ఇతర ఇండియా కూటమి పార్టీలు వ్యతిరేకించాయి. దీంతో బిల్లుని చర్చించడానికి జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేశారు. ఇది మైనారిటీలపై, రాజ్యాంగంపై దాడిగా కాంగ్రెస్ అభివర్ణించింది.

ఇదిలా ఉంటే, బీహార్‌లోని సున్నీ వక్ఫ్ బోర్డు ఒక గ్రామంలో చాలా కాలంగా నివసిస్తున్న వారికి నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. సదరు భూమి వక్ఫ్ భూమిగా పేర్కొంటూ ఖాళీ చేయాలని ఆదేశించింది. ఈ వివాదాస్పద ప్రాంతంలో నివసించే వారిలో ఎక్కువ మంది హిందువులు ఉన్నారు. ప్రస్తుతం ఈ సమస్య పాట్నా హైకోర్టు ముందు ఉంది, సున్నీ వక్ఫ్ బోర్డు వారి వాదనలకు మద్దతుగా ఎలాంటి సాక్ష్యాధారాలను అందించడంలో విఫలమైంది.

Read Also: Shivaji Statue: షాకింగ్ న్యూస్.. శివాజీ విగ్రహం కూలుతుందని ముందే తెలుసు.. చెప్పినా పట్టించుకోలేదు!

దేశవ్యాప్తంగా వక్ఫ్ బోర్డు బిల్లుపై పెరుగుతున్న నేపథ్యంలో బీహార్‌ రాజధాని పాట్నాలోని గోవింద్‌పూర్ గ్రామంలో నుంచి తాజా ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామంలో చాలా కాలంగా నివసిస్తున్న వారికి నోటీసులు జారీ చేసి, సదరు భూమి వక్ఫ్‌దిగా క్లెయిమ్ చేసింది. వక్ఫ్ బోర్డు ఆధారాలు సమర్పించడంలో విఫలం చెందడంతో బాధితులకు ఉపశమనం లభించింది. అయితే, ఇప్పటికీ నోటీసులు తొలగించకపోవడంతో పలువురు నివాసితులు భయాందోళనకు గురవుతున్నారు.

‘‘ఈ భూమి వక్ఫ్ బోర్డుకు చెందినదని పేర్కొంటూ మాకు నోటీసు వచ్చింది మరియు వచ్చే 30 రోజుల్లో ఈ స్థలాన్ని వదిలివేయాలని కోరింది. మేము 50 సంవత్సరాల నుండి ఇక్కడ నివసిస్తున్నాము’’ అని పిటిషనర్ రామ్ లాల్ అన్నారు. ఇదిలా ఉంటే సున్నీ వక్ఫ్ బోర్డు చైర్మన్ ఇర్షాదుల్లా మాట్లాడుతూ.. ఒకసారి వక్ఫ్ భూమి, ఎల్లప్పుడూ వక్ఫ్ ఆస్తి అని, ఈ భూమి ఆక్రమణకు గురైందని ఆయన అన్నారు. దీనిపై బీహార్ మంత్రి జమాఖాన్ మాట్లాడుతూ, ఈ అంశంపై విచారణ జరుగుతోందని, వక్ఫ్ భూమిగా తేలితే వారికి అప్పగిస్తామని లేని పక్షంలో దానిని వదులుకుంటామని చెప్పారు.