వరుస పరాజయాలు, షాక్‌లతో దెబ్బతిన్న పార్టీని మళ్లీ గాడిలోపెట్టేందుకు ఓ వైపు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోన్న సమయంలో.. మరో సీనియర్ నేత, పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీకి కీలక నేతగా ఉన్న వ్యక్తి గుడ్‌బై చెప్పేశారు.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అధ్యోతన జైపూర్‌లో చింతన్ శిబర్ జరుగుతోన్న వేళ.. ఈ పరిణామం చోటు చేసుకోవడం చర్చగా మారింది..
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్ మాజీ పీసీసీ చీఫ్ సునీల్ జాకర్ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.. అయితే, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నేపథ‍్యంలో ఆయనపై కాంగ్రెస్ క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు సిద్ధం అవుతుండగా.. జాకర్ పార్టీకి రాజీనామా చేసి తప్పుకున్నారు.. కాగా, పంజాబ్ సీఎం పదవికి అమరీందర్ సింగ్ రాజీనామా చేసిన తర్వాత జాకర్… సీఎం రేసులో ఉన్నట్టు వార్తలు వచ్చాయా.. కానీ, కాంగ్రెస్ అధినాయకత్వం.. అనూహ్యంగా ఛన్నీని సీఎంను చేయడంతో.. పార్టీకి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి క్రమశిక్షణా ఉల్లంఘనకు పాల్పడ్డారు జాకర్.. దీంతో అధిష్టానం ఆయనపై చర్యలు తీసుకునేందుకు సిద్ధం కాగా.. అనుహ్యంగా ఆయనే పార్టీ నుంచి తప్పుకున్నారు.. ఇవాళ ఫేస్ బుక్ లైవ్‌లో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ వీడుతున్నానని చెబుతూ.. గుడ్ బై.. గుడ్ లక్ కాంగ్రెస్ అంటూ కామెంట్ చేశారు.
అయితే, గత నెలలో, సునీల్ జాకర్‌ను పార్టీ నుండి రెండేళ్లపాటు సస్పెండ్ చేయాలని మరియు అన్ని పదవుల నుండి తొలగించాలని కాంగ్రెస్ క్రమశిక్షణా ప్యానెల్ సిఫార్సు చేసింది. ఐదుగురు సభ్యుల కమిటీకి పార్టీ సీనియర్ నేత ఎకె ఆంటోనీ అధ్యక్షత వహిస్తారు. జాకర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై జరిగిన సమావేశంలో ఆంటోనీతో పాటు సభ్యులు తారిఖ్ అన్వర్, జెపి అగర్వాల్ మరియు జి పరమేశ్వర్ కూడా పాల్గొన్నారు.