Sharad Pawar vs Sunetra Pawar: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. NCP అధినేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మృతి చెందడంతో.. ఆయన భార్య సునేత్రా పవార్‌ను ఉప ముఖ్యమంత్రిగా నియమించే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సునేత్రా పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారన్న ప్రచారంపై సీనియర్ నేత శరద్ పవార్ స్పందించారు. సునేత్రా పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారా అనే ప్రశ్నకు శరద్ పవార్ స్పందిస్తూ, దీనిపై నాకు ఎలాంటి సమాచారం లేదు. ఈ నిర్ణయం ఆమె పార్టీ స్థాయిలో తీసుకుని ఉండాలి. ప్రఫుల్ పటేల్, సునీల్ తత్కరే వంటి నేతల పేర్లు వినిపిస్తున్నాయి. అంతర్గతంగా ఏదో నిర్ణయం జరిగి ఉండొచ్చు అని వ్యాఖ్యానించారు.
Read Also: Smoking: 20ఏళ్లలోపే స్మోక్ చేశారా? షాకింగ్ నిజాలు బయటపెట్టిన పరిశోధన!
రెండు NCPల విలీనంపై శరద్ పవార్ వ్యాఖ్యలు
రెండు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీల (NCP) విలీనంపై కూడా శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. అటువంటి పరిస్థితిలో ఎలా ముందుకు వెళ్లాలో అందరూ ఆలోచించాలి. ఎవరైనా బాధ్యత తీసుకుని ముందుకు రావాల్సిన అవసరం ఉంది అని అన్నారు. అయితే, గత నాలుగు నెలలుగా రెండు NCPల విలీనంపై చర్చలు జరుగుతున్నాయని, ఈ ప్రక్రియకు అజిత్ పవార్, జయంత్ పాటిల్ నాయకత్వం వహిస్తున్నారని తెలిపారు. అయితే ఈ విలీనం ఖచ్చితంగా జరుగుతుందా లేదా అన్నది ఇంకా స్పష్టతకు రాలేదన్నారు. రెండు పార్టీలు కలవాలనేది అజిత్ పవార్ కోరికగా ఆయన పేర్కొన్నారు.
అయితే, ఈ పరిణామాలపై తాను ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని శరద్ పవార్ స్పష్టం చేశారు. “తదుపరి చర్యలపై నిర్ణయం పార్టీదే. సునేత్రా పవార్‌తో నేను ఎలాంటి చర్చలు జరపలేదు. సునీల్ తత్కరే, ఛగన్ భుజ్‌బల్, ప్రఫుల్ పటేల్ ముఖ్యమంత్రితో చర్చించి ఉండవచ్చు. ఈ విషయాన్ని నేను ఈ ఉదయం పత్రికల్లోనే చదివాను” అని తెలిపారు. ఇదిలా ఉండగా, రెండు NCPల విలీనంపై బారామతిలోని గోవింద్ బాగ్‌లో శరద్ పవార్, అజిత్ పవార్ మధ్య కీలక సమావేశం జరిగినట్లు సమాచారం. ఈ సమావేశం జనవరి 17న జరిగిందని, ఫిబ్రవరి 12న విలీనానికి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
