NCP Crisis: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అధినేత, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణంతో మహారాష్ట్ర రాజకీయాల్లో ‘‘పవర్ గేమ్’’ మొదలైంది. ఎన్సీపీకి తదుపరి అధినేత ఎవరనే ప్రశ్న ఉత్పత్నమవుతోంది. మరోవైపు, అజిత్ పవార్ వర్గం, శరద్ పవార్ వర్గం కలిసిపోతాయనే చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్‌ను మహారాష్ట్ర డిప్యూటీ సీఎం పదవి కోసం పార్టీ నామినేట్ చేయనున్నట్లు తెలుస్తోంది.
సీనియర్ ఎన్సీపీ నేత, మహారాస్ట్ర ఎఫ్‌డీఏ మంత్రి నర్హరి జిర్వాల్ గురువారం మాట్లాడుతూ.. సునేత్ర పవార్‌ను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. మరోవైపు, ఎన్సీపీ నేతలు ప్రఫుల్ పటేల్, ఛగన్ భుజ్ బల్, ధనంజయ్ ముండే, సునీల్ తట్కరేలు సునేత్ర పవార్‌తో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. అజిత్ పవార్ మరణంతో ఖాళీ అయిన అసెంబ్లీ స్థానం నుంచి సునేత్రా పవార్‌ను పోటీలో దింపాలని ఎన్సీపీ భావిస్తోంది.
ఇక పార్టీ కార్యక్రమాలనున నడిపించడానికి ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రఫుల్ పటేల్ ముందుంటారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇదే విధంగా శరద్ పవార్, అజిత్ పవార్ వర్గాలు కలిసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల, ఈ రెండు కూటములు కలిసి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేశాయి. అజిత్ పవార్ ఎన్సీపీ రాష్ట్రంలో బీజేపీ-శివసేనతో కలిసి మహాయుతి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. ప్రస్తుతం సునేత్రా పవార్ రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు.
