NTV Telugu Site icon

Bournvita: బోర్న్‌విటాలో చక్కెర చేదును మిగిల్చిందా..? “హెల్త్ డ్రింక్” ట్యాగ్ ఎందుకు కోల్పోయింది..?

Bourn Vita

Bourn Vita

Bournvita: బోర్న్‌విటా ఇండియాలో తెలియని పిల్లలు, తల్లిదండ్రులు ఉండరంటే అతిశయోక్తి కాదు. అయితే, ప్రస్తుతం బోర్న్‌విటా ‘హెల్త్ డ్రింక్’ అనే ట్యాగ్ కోల్పోయింది. దీనిని హెల్త్ డ్రింక్ కేటగిరి నుంచి తీసేయాలని కేంద్రం అన్ని ఈ-కామర్స్ ప్లాట్‌ఫారంలకు ఆదేశాలు జారీ చేసింది. ఇతర పానీయాల విషయంలో కూడా ఇదే చర్య తీసుకోవాలని ఈ-కామర్స్‌ని ఆదేశించింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్(FSS) చట్టం 2006 లేదా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) సమర్పించిన నిబంధనల ప్రకారం.. అసలు ‘హెల్త్ డ్రింక్’ అనే పదాన్ని నిర్వచించలేదని వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. బోర్న్‌విటాలో చక్కెర స్థాయిలు ఆమోదయోగ్యమైన పరిమితుల కంటే చాలా ఎక్కువగా ఉన్నాయని ఎన్‌సిపిసిఆర్ చేసిన దర్యాప్తును అనుసరించి బుధవారం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.

Read Also: Hasnuram Ambedkari: “సెంచరీనే నా లక్ష్యం”.. 98 సార్లు ఎన్నికల్లో ఓడిపోయినా మళ్లీ పోటీకి సిద్ధం..

బోర్న్‌విటాలోని అధిక చక్కెరనే ఆ బ్రాండ్‌కి ప్రతికూలంగా మారింది. గతేడాది ఇన్‌ఫ్లూయెన్సర్ రేవంత్ హిమత్‌సింకా చేసిన ఓ వీడియో వైరల్ అయింది. బోర్న్‌విటా తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. ఇందులో చక్కెర శాతం ఎక్కువగా ఉందని, ఇది అనుమతించిన దాని కన్నా ఎక్కువ అని ఆరోపించారు. ఈ వీడియో వైరల్ కావడంతో నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (NCPCR) నివేదికను హైలెట్ చేస్తూ, తప్పుదోవ పట్టించే ప్రకటనలు, ప్యాకేజింగ్, లేబుల్స్‌ని ఉపసంహరించుకోవాలని బోర్న్‌విటాను కోరింది. క్యాడ్‌బరీ బోర్న్‌విటా యొక్క ఆరోగ్య ప్రయోజనాల గురించి తప్పుడు వాదనల్ని వినిపిస్తోందని, దాని పోషక విలువలు తప్పుగా ఉన్నాయని హిమత్‌సింకా ఆరోపించారు. మొత్తం 100 గ్రాముల బ్యాగులో 50 గ్రాముల చక్కెర ఉందని, బ్యాగ్‌లో సగం చక్కెర మాత్రమే అని చెప్పాడు. దీని తర్వాత గతేడాది డిసెంబర్ నెలలో చక్కెర పరిమాణాన్ని 14.4 శాతం తగ్గించినట్లు మోండెలేజ్ చెప్పింది. 100 గ్రాముల్లో 37.4 గ్రాముల చక్కెరని 32.2 గ్రాములకు తగ్గించింది.

అయితే, బోర్న్‌విటాలో చక్కెర పిల్లలకు సిఫారసు చేసిన రోజూ వారీ చక్కెర కంటే తక్కువగా ఉందని మోండెలెజ్ పేర్కొంది. ఇది అందించబడినప్పుడల్లా దీంట్లో 7.5 గ్రాముల చక్కెర ఉందని, ఇది సుమారుగా ఒకటిన్నర టీస్పూన్లకు సమానమని, ఇది పిల్లలకు రోజూవారీ సిఫారసు చేసిన చక్కెర పరిమితుల కన్నా తక్కువ అని కంపెనీ పేర్కొంది. ఏడు దశాబ్ధాలుగా బోర్న్‌వీటా వినియోగదారుల ప్రేమ, నమ్మకాన్ని పొందిందని, దీనిలో విటమిన్ ఎ, సి, డి, ఐరన్, జింక్, కాపర్ మరియు సెలీనియం అనే పోషకాలు ఉన్నాయి, ఇవి రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడతాయని చెప్పింది.

Show comments