NTV Telugu Site icon

Subramanian Swamy: శ్రీలంకకు ఇండియన్ ఆర్మీని పంపాలి

Subramanian Swamy

Subramanian Swamy

ద్వీప దేశం శ్రీలంక రగులుతోంది. మొత్తం దేశం రావణకాష్టంలా మారుతోంది. తీవ్రమైన ఆర్థిక, ఆహారం సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. పూర్తిగా చెప్పాలంటే రాజపక్సే ప్రభుత్వం శ్రీలంకను అప్పుల ఊబిలోకి నెట్టేసింది. దీంతో పాటు అక్కడ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తీవ్ర ఆహార కొరతకు  కారణం అయ్యాయి. మరోవైపు ఆర్థిక పరిస్థితికి మించి విదేశాల నుంచి ముఖ్యంగా చైనా నుంచి అప్పులు తీసుకుంది. అప్పులు చెల్లించలేక హంబన్ టోటా రేవును చైనాకు లీజుకు ఇచ్చింది. అధ్యక్షుడు గొటబయ రాజపక్సే, ప్రధాని మహిందా రాజపక్సే, రాజపక్సే కుటుంబీకుల కారణంగానే శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ఏర్పడిందన ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన, ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు.

ప్రస్తుతం శ్రీలంక దేశంలో నిన్నటి నుంచి హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రాజపక్సే పూర్వీకుల ఇళ్లను నిరసనకారులు తగలబెట్టారు. రాజీనామా చేసిన ప్రధాని మహీందా రాజపక్సేను భద్రత కారణాలతో సురక్షిత ప్రదేశానికి తరలించింది. ఇదిలా ఉంటే అక్కడి పోలీసులకు, ఆర్మీకి ప్రభుత్వం విశేషాధికారాలను కట్టబెట్టింది. హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్న వారిని కనిపిస్తే కాల్చివేయాలనే ఉత్తర్వులు ఇచ్చింది. ప్రస్తుతం శ్రీలంకలో హింసాత్మక ఘటనల వల్ల ఆరుగులు మరణించారు…11 మంది పరిస్థితి విషమంగా ఉంది. 200 మందికి పైగా ప్రజలు గాయపడ్డారు.

ఇదిలా ఉంటే బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీలంకకు ఇండియన్ ఆర్మీని పంపాలని సూచించారు. శ్రీలంకలో రాజ్యాంగబద్ధ పాలనను తీసుకురావడానికి ఇండియన్ ఆర్మీని పంపాలని… కొన్ని విదేశీ శక్తులు భారతదేశానికి వ్యతిరేకంగా ప్రజల ఆగ్రహాన్ని ఉపయోగించుకుంటున్నాయి… ఇది భారతదేశ భద్రతను ప్రభావితం చేస్తుందంటూ…ట్వీట్ చేశారు. గతంలో 1987లో శ్రీలంక అధ్యక్షుడిగా జయవర్థనే ఉన్నప్పుడు శ్రీలంక ఉత్తర ప్రాంతంలో సాధారణ పరిస్థితులను తీసుకురావడానికి ఇండియా ఆర్మీని పంపిందని… ఎన్నికలు కూడా నిర్వహించిందని.. అయితే ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రేమదాస ఎల్టీటీఈకి ఆయుధాలు, ఆర్థిక సహాయం అందించి భారత్ ను మోసం చేశాడని ట్విట్టర్లో రాసుకొచ్చారు.