Anna University: చెన్నై అన్నా యూనివర్సిటీలో దారుణం జరిగింది. యూనివర్సిటీలో చదువుతున్న 19 ఏళ్ల విద్యార్థినిపై గుర్తుతెలియని వ్యక్తులు లైంగిక దాడి చేశారు. తన ప్రియుడితో మాట్లాడుతున్న సమయంలో, ఇద్దరు వ్యక్తులు వచ్చి దాడి చేశారు. ప్రియుడి కొట్టి, విద్యార్థినిపై లైంగిక దాడి చేశారు. డిసెంబర్ 23 సాయంత్రం ఈ ఘటన జరిగింది. మంగళవారం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధిత యువతి యూనివర్సిటీలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతోంది. యూనివర్సిటీ క్యాంపస్‌లో ఈ ఘటన జరగడంపై ప్రతిపక్షాలు ఎంకే స్టాలిన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి.
ఈ కేసులో ఒకరిని అరెస్ట్ చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. నిందితులు ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు చిత్రీకరించి ఇద్దరిని బ్లాక్‌మెయిల్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నిందితుడిని దాదాపుగా అదుపులోకి తీసుకున్నట్లుగా సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఈ ఘటనపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ప్రభుత్వంపై విమర్శలు చేశారు. నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి భయంకరంగా ఉందని డీఎంకే ప్రభుత్వంపై మండిపడ్డారు. “తమిళనాడు, డిఎంకె ప్రభుత్వ హయాంలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు నిలయంగా మారింది మరియు నేరస్థులకు స్వర్గధామంగా మారింది. విపక్షాల నోరు మూయించేందుకు అధికార యంత్రాంగం పోలీసులను బిజీగా ఉంచడంతో రాష్ట్రంలో మహిళలు సురక్షితంగా లేరు.” అని ట్వీట్ చేశారు.