Site icon NTV Telugu

Strange Weather Condition: విచిత్ర వాతావరణ పరిస్థితి.. పగలేమో ఎండ మంట.. రాత్రైతే వణుకు..!

Weather

Weather

Strange Weather Condition: తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పగలేమో ఎండ దంచేస్తోంది.. రాత్రైతే చలి వణికిస్తోంది. ఫిబ్రవరిలోనే.. సమ్మర్‌ ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. పగటిపూట 38 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు.. రాత్రికి సింగిల్‌ డిజిట్‌ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ఉష్ణోగ్రతల్లో అత్యధిక హెచ్చుతగ్గులతో.. జనం ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో గత నాలుగు రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు మరింత పడిపోయాయి. చలి వణికిస్తోంది. దీంతో రాష్ట్రంలోనే అత్యల్పంగా అల్లూరి జిల్లా కుంతలంలో 7.5, జీకే వీధిలో 7.7, చింతపల్లిలో 8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లా కట్టకిందపల్లి, గంగవరంలో 10 డిగ్రీలుగా ఉంది. ఇక శ్రీసత్యసాయి, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 11 నుంచి 12 డిగ్రీల్లోపు ఉంటున్నాయి. రాత్రి 10 గంటల తర్వాత పెరుగుతున్న చలి తీవ్రత.. ఉదయం వరకూ కొనసాగుతోంది.

Read Also: CM KCR: కేసీఆర్ కొండగట్టు పర్యటన రేపటికి వాయిదా.. షెడ్యూల్ ఇదే..

అటు తెలంగాణలోనూ.. రాత్రి సమయంలో చలి పంజా విసురుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సింగిల్ డిజిట్‌ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొమురం భీం జిల్లా సిర్పూర్‌లో 7.1, మంచిర్యాల జిల్లా కవ్వాల్ టైగర్ జోన్‌లో 7.9, ఆదిలాబాద్‌ జిల్లా బజార్ హత్నూర్‌లో 8.9, నిర్మల్ జిల్లా జామ్‌లో 10.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు ఏపీలో నాలుగైదు రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 డిగ్రీలకు పైగా పెరిగాయి. పగటిపూట 38 డిగ్రీలు నమోదవుతుండటంతో .. ఫిబ్రవరిలోనే ఎండాకాలం తలపిస్తోంది. రాయలసీమ, దక్షిణ కోస్తాలోనే కాదు, ఉత్తరాంధ్రలోనూ పగటి ఉష్ణోగ్రతల పెరుగుదల అధికంగా ఉంది. దీంతో ఏసీల వాడకం మొదలైంది. వారం క్రితంతో పోలిస్తే విద్యుత్తు వినియోగం 8 మిలియన్‌ యూనిట్ల వరకు పెరిగింది. సోమవారం తిరుపతి జిల్లా వరదయ్యపాలెంలో 38, శ్రీ పొట్టిశ్రీరాములు జిల్లా చిలకలమర్రిలో 37.8, ప్రకాశం జిల్లా పునుగోడులో 37.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయయ్యాయి.

Exit mobile version