Site icon NTV Telugu

JNU: జెఎన్‌యూలో మోదీ డాక్యుమెంటరీ రగడ.. ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐల మధ్య ఉద్రిక్తత

Jnu Incident

Jnu Incident

BBC documentary on modi: ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జెఎన్‌యూ) మరోసారి వార్తల్లో నిలిచింది. యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రధాని నరేంద్రమోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’ని ప్రదర్శించడంపై విద్యార్థి సంఘాల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ ఈ డాక్యుమెంటరీపై నిషేధం విధించినా.. పట్టించుకోకుండా లెఫ్ట్ విద్యార్థి సంఘం (ఎస్ఎఫ్ఐ) డాక్యుమెంటరీని ప్రదర్శించేందుకు సిద్ధం అయింది.

Read Also: Mike Pompeo: బాలాకోట్ దాడుల తర్వాత భారత్ పై అణుదాడికి సిద్ధమైన పాకిస్తాన్..

అయితే ప్రదర్శన సమయంలో యూనివర్సిటీ వర్గాలు కరెంట్ తీసేయడంతో విద్యార్థుల సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లలో డాక్యుమెంటరీ చూసేందుకు సిద్ధం అయ్యారు. ఈ డాక్యుమెంటరీ చూస్తున్న సమయంలో రాళ్లదాడి జరిగింది. అయితే తమపై బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం అయిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) రాళ్ల దాడికి పాల్పడిందంటూ ఎస్ఎఫ్ఐ ఆరోపించింది. మంగళవారం రాత్రి 9 గంటలకు ఈ ఘటన జరిగింది. దీనిపై వసంత్ కుంజ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. రాళ్లదాడిలో 25 మంది పాల్గొన్నట్లు లెఫ్ట్ విద్యార్థి సంఘం ఆరోపించింది. అర్థరాత్రి సమయంలో పోలీసులు క్యాంపస్ కు చేరుకున్నారు.

2002 గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో బీబీసీ ప్రధాని మోదీపై డాక్యుమెంటరీ రూపొందించింది. ఆ సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ ఈ అల్లర్లకు సహకరించారని డాక్యుమెంటరీలో ఆరోపించారు. ఇది యూకేతో పాటు ఇండియాలో కూడా వివాదాస్పదం అయింది. ఇప్పటికే ఈ వీడియోను కేంద్రం బ్లాక్ చేసింది. అంతకుముందు సోమవారం హైదరాబాద్ లోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా ఈ డాక్యుమెంటరీ ప్రదర్శన వివాదాస్పదం అయింది. ప్రస్తుతం జెఎన్‌యూలో ఈ డాక్యుమెంటరీ ఉద్రిక్తతలను రాజేసింది.

Exit mobile version