Site icon NTV Telugu

Srinagar: శ్రీనగర్-లేహ్ రహదారిపై భారీ హిమపాతం.. ఏడుగురు మృతి

Srinagar

Srinagar

శ్రీనగర్‌పై ప్రకృతి కన్నెర్రజేసింది. ఒక్కసారిగా భారీ హిమపాతం సృష్టించింది. శ్రీనగర్-లేహ్ రహదారిపై హిమసంపాతం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు చనిపోగా.. పలువురికి గాయాల పాలయ్యారు. ఇక పలు వాహనాలు హిమపాతంలో చిక్కుకుపోయాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

శుక్రవారం మధ్యాహ్నం శ్రీనగర్-లేహ్ హైవేపై హిమసంపాతం జరిగినట్లుగా లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే. సక్సేనా ఎక్స్‌లో పేర్కొన్నారు. తాను స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.

‘‘జోజి లా దగ్గర హిమసంపాతం సంభవించిన దురదృష్టకర వార్త విన్నాను. వెంటనే సంఘటనా స్థలాన్ని సందర్శించి, సహాయక, రెస్క్యూ ఆపరేషన్లను ప్రారంభించాలని కార్గిల్ డీసీ, ఎస్ఎస్పీలను ఆదేశించాను. విపత్తు సహాయక దళాలు, బీఆర్ఓతో సహా అన్ని ప్రభుత్వ సంస్థలను హై అలర్ట్‌లో ఉంచాను. నేను వ్యక్తిగతంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాను.’’ అని ఎక్స్ పోస్ట్‌లో లెప్టినెంట్ గవర్నర్ వీకే. సక్సేనా పేర్కొన్నారు.

హిమపాతంలో దాదాపు డజను కార్లు మంచు కింద కూరుకుపోయాయని.. ఈ ఘటనలో ఏడుగురు మరణించగా.. మరో ఐదుగురు గాయపడ్డారని అధికారులు తెలిపారు.

ఇదిలా ఉండగా కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ట్వీట్ చేస్తూ.. ‘‘జోజిలా కనుమ దగ్గర వాహనంపై హిమపాతం విరుచుకుపడటంతో 7 మంది విషాదకరంగా మరణించడం, మరో 5 మంది గాయపడటం గురించి తెలిసి చాలా బాధపడ్డాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారికి అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నాము.’’ అని తెలిపారు.

Exit mobile version