Jyoti Malhotra: పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తున్న హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు కోర్టు షాక్ ఇచ్చింది. ఆమె బెయిల్ పిటిషన్‌ని తిరస్కరించింది. బెయిల్ పిటిషన్‌ని విచారించిన హిసార్ కోర్టు బెయిల్ ఇవ్వడానికి బుధవారం నిరాకరించింది. దర్యాప్తు చురుకుగా సాగుతున్న ఈ సమయంలో నిందితురాలికి బెయిల్ ఇవ్వడం దర్యాప్తును దెబ్బతీస్తుందని పోలీసులు కోర్టుకు తెలియజేశారు. ఇరు వర్గాల వాదన విన్న కోర్టు బెయిల్ పిటిషన్‌ని తిరస్కరించింది.
Read Also: Sonam Raghuvanshi case: “నా చెల్లిని ఉరితీయాలి”.. సోనమ్ సోదరుడి డిమాండ్..
దీనికి ముందు జూన్ 09న కోర్టు జ్యోతి మల్హోత్రా జ్యుడీషియల్ కస్టడీని పొడగించింది. తదుపరి విచారణను జూన్ 23కి వాయిదా వేసింది. ‘‘ట్రావెల్ విత్ జో’’ అనే యూట్యూబ్ ఛానెల్ రన్ చేస్తున్న జ్యోతి మల్హోత్రా మూడు సార్లు పాకిస్తాన్ వెళ్లి వచ్చింది. పాకిస్తాన్‌లోని ఐఎస్ఐ ఏజెంట్లతో పాటు భారత్ లోని పాకిస్తాన్ రాయబార కార్యాలయంలో పనిచేసే డానిష్ అనే వ్యక్తితో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు విచారణలో వెల్లడైంది.
అధికారిక రహస్యాల చట్టం మరియు భారతీయ న్యాయ సంహిత నిబంధనల ప్రకారం మల్హోత్రాను మే 16న న్యూ అగర్సేన్ ఎక్స్‌టెన్షన్ ప్రాంతం నుండి హిసార్ పోలీసులు అరెస్టు చేశారు. మల్హోత్రా నవంబర్ 2023 నుంచి పాకిస్తాన్ హైకమిషన్ ఉద్యోగి ఎహ్సాన్ ఉర్ రహీ అలియాస్ డానిష్‌తో పరిచయం కలిగి ఉన్నట్లు తేలింది. పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ మల్హోత్రాను ఒక ఆస్తిగా భావించింది. పాకిస్తాన్ టూర్‌లో ఆమెకు వీఐపీ ప్రోటోకాల్ ఇచ్చింది. గన్ మెన్లతో రక్షణ కల్పించింది.