కర్ణాటక కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి మార్పు అంశం కాకరేపుతోంది. సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి పదవి నుంచి దించేయాలని డీకే.శివకుమార్ మద్దతుదారులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. లేదంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయమని చెబుతున్నారు. దీంతో సిద్ధరామయ్య వర్సెస్ డీకే.శివకుమార్ అనే విధంగా పరిణామాలు మారిపోయాయి. తాజా పరిస్థితులపై కాంగ్రెస్ అధిష్టానం అప్రమత్తం అయింది. హైకమాండ్ దూతలను కర్ణాటకకు పంపించింది. ప్రస్తుత పరిణామాలను కాంగ్రెస్ దూతలు పరిశీలిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Thammudu : ‘తమ్ముడు’ రిలీజ్ ట్రైలర్.. నితిన్ ఈ సారైన హిట్ దక్కేనా..!
డీకే.శివకుమార్‌కు మద్దతుగా 100 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని.. తక్షణమే డీకే.శివకుమార్‌ను ముఖ్యమంత్రిని చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సే్న్ డిమాండ్ చేశారు. మిగిలిన పదవీ కాలం అయినా డీకే.శివకుమార్‌కు అప్పగించకపోతే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయమని తేల్చి చెప్పారు. చాలా మంది డీకే.శివకుమార్ ముఖ్యమంత్రి కావాలని ఎదురుచూస్తు్న్నారని.. ఆ పదవి పొందేందుకు అర్హుడు అని తెలిపారు. పార్టీ విజయం కోసం అవిశ్రాంతంగా పని చేశారని గుర్తుచేశారు. కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేయాలంటే డీకే.శివకుమార్ వల్లే సాధ్యమని చెప్పుకొచ్చారు. మెజార్టీ ఎమ్మెల్యేలంతా డీకే.శివకుమార్ వెంటే ఉన్నారని తెలిపారు. ఇప్పుడు గనుక ముఖ్యమంత్రిని మార్చకపోతే.. 2028లో మాత్రం కర్ణాటకలో కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయమని జోష్యం చెప్పారు. ముఖ్యమంత్రి మార్పుపై హైకమాండ్ మాత్రమే నిర్ణయం తీసుకోగలదని మల్లిఖార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలకు ఇక్బాల్ స్పందిస్తూ.. కాంగ్రెస్‌లో క్రమశిక్షణ ఉంటుందని.. ఎల్లప్పుడూ హైకమాండ్‌ను గౌరవిస్తామని.. కానీ వాస్తవాలు చెప్పాలి కదా? అని బదులిచ్చారు.
ఇది కూడా చదవండి: Viral News : గేదెకు రూ.14 లక్షలు.. అరేయ్ ఏంట్రా ఇది..
ఇక కర్ణాటక ప్రభుత్వంలో చోటుచేసుకున్న హఠాత్తు పరిణామాలను పరిశీలించేందుకు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రణదీప్ సింగ్ సుర్జేవాలా బెంగళూరుకు వచ్చారు. అసంతృప్తి ఎమ్మెల్యేలతో కలిసి వివరాలు సేకరించనున్నారు. ముఖ్యమంత్రి మార్పుపై అభిప్రాయాలు సేకరించి.. అధిష్టానానికి నివేదిక అందజేయనున్నారు.
