Special Story on Vinayaka Nimajjanam: మన దేశంలో ఇన్ని రోజులు ఇంత మంది జనం కలిసిమెలిసి చేసుకునే పండుగ వినాయకచవితి తప్ప మరొకటి కాదేమో. గణేషుడి పుట్టిన రోజున ఘనంగా మొదలయ్యే ఈ నవరాత్రి ఉత్సవాలు నిరాటంకంగా భక్తిశ్రద్ధలతో ఆనందోత్సాహాల మధ్య సాగాయి. బొజ్జగణపయ్య బొమ్మలను పూజల కోసం కొలువు దీర్చిన పవిత్రమైన క్షణం నుంచి గంగమ్మ ఒడిలోకి చేర్చే గడియ వరకు ప్రతి రోజూ ప్రతిఒక్కరూ ఈ వేడుకల్లో ఆద్యంతం పాల్గొన్నారు. పార్వతీ పుత్రుడి మండపాలకు ప్రత్యేక అలంకరణలు చేశారు. డీజే సౌండ్ సిస్టమ్‌ను ఏర్పాటుచేసి భక్తి గీతాలు, సినిమా పాటలతోపాటు ట్రెండింగ్‌లో ఉన్న సాంగ్స్ ప్లే చేస్తూ చుట్టుపక్కల ఇళ్లల్లో ఉండేవాళ్లను సెలబ్రేషన్ మోడ్‌లోకి, హ్యాపీ మూడ్‌లోకి తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా అన్నదానాలు చేశారు. అన్ని దానాల కన్నా ఇదే గొప్పదని పరోక్షంగా చెప్పారు. ప్రసాదాల పంపిణీ చేపట్టారు. లక్కీ డ్రా, బంపర్ డ్రా పోటీలు నిర్వహించారు. సంతోషం వెల్లివిరిసిన ఈ సంబరాలు.. చివరి రోజున అంటే నిన్న సాయంత్రం నుంచి పీక్ ‘స్టేజ్’కి చేరాయి. పల్లెలు-పట్టణాలు, నగరాలు-రాజధానులు అనే తేడా లేకుండా దేశం మొత్తం ఫెస్టివల్ లుక్ సంతరించుకుంది. కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలు అనే భేదం కనపడకుండా అందరూ ఉల్లాసంగా పండగ చేసుకున్నారు. చిన్నా-పెద్ద, ఆడ-మగ, పిల్లలు-తల్లులు, తండ్రులు-కొడుకులు, కోడళ్లు-కూతుర్లు అని చూడకుండా అన్ని వయసుల వాళ్లూ, అన్ని వరసల వాళ్లూ ఉత్సాహంగా పాల్గొన్నారు. గ్రాండ్‌గా బ్యాండ్ మేళాలతో సరికొత్త బ్రాడ్ బ్యాండ్‌ని క్రియేట్ చేశారు. వానొచ్చినా, ఉరుమొచ్చినా లెక్క చేయకుండా డ్యాన్స్ చేశారు.
మరీ ముఖ్యంగా ప్రతిమలను నిమజ్జనానికి తరలించే ముందు మూషిక వాహనుణ్ని మర వాహనాల మీద జాగ్రత్తగా అమర్చి వాటి ముందు ప్రధాన రహదారులపై మస్తు హడావుడి చేశారు. ఉట్టి కొట్టే ఘట్టంలో చోటుచేసుకున్న హల్‌చల్‌కి ఆకాశమే హద్దు అని చెప్పొచ్చు. లంబోదరుడి లడ్డూ వేలం పాటల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఒకరిని మించి ఒకరు ‘తగ్గేదేలా’ అనే రేంజ్‌లో పోటీపడ్డారు. తక్కువలోతక్కువగా ‘నూట పదహారు రూపాయలు’ అనే సెంటిమెంట్ ఫిగర్‌తో స్టార్ట్ చేసి ఆ డిజిట్‌ని ఎక్కడికో తీసుకెళ్లారు. లోకల్‌లో తమ పలుకుబడిని ప్రతిబింబించేలా సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ఈ ఓపెన్ ఆక్షన్‌లో పాలుపంచుకున్నారు. విజేతగా నిలిచింది ఎవరైనా ఆ ఫలహారాన్ని అన్ని ఇళ్లకూ పంచారు. ఈ వక్రతుండుడి వేడుకలు యూత్ జోష్‌కి అద్దం పట్టాయి.
స్పెషల్, యూనిక్, కలర్‌ఫుల్ యూనిఫామ్‌లు, కంకణాలు ధరించి అన్ని కార్యక్రమాలనూ వాళ్లే దగ్గరుండి చూసుకున్నారు. కరెంట్ పోతే సైలెంట్ అవ్వాల్సి వస్తుందేమోనని జనరేటర్లను సైతం అడ్వాన్స్‌గా సెట్ చేశారు. చిన్న, చిన్న రంగు రంగుల పేపర్ కటింగ్‌లను గొట్టపు యంత్రంలో పోసి మధ్య మధ్యలో గాల్లోకి పెద్దఎత్తున వదులుతూ పూల వర్షం కురిపించిన ఫీలింగ్ కలిగించారు. గజాననుణ్ని జలాశయంలో కలిపేందుకు కిలో మీటర్ల పొడవునా పొడవాటి ఓపెన్ కంటెయినర్లపై ప్రయాణిస్తూ రాత్రంతా జాగారం చేశారు. అలా అని ఊరికే కూర్చున్నారా అంటే అసలు ఆ సమస్యే లేదు. అడుగడుగునా అద్దిరిపోయే పాటలకు కాలు కదుపుతూనే ముందుకు కదిలారు. చూపరులకు కనువిందు చేశారు.
ఈ విషయాలన్నీ అందరికీ తెలిసినవే అయినా ఇప్పుడు ఎందుకు పనిగట్టుకొని ప్రస్తావించుకుంటున్నామంటే.. ఈ పర్వదినం వినాయక విగ్రహాలనే కాదు ప్రజల్లోని వివిధ వివక్షలను కూడా నిమజ్జనం చేస్తోంది. ‘‘ఉన్నోడు-లేనోడు’’ అనే తారతమ్యాలకు, ప్రతికూల భావాలకు కనీసం ఈ తొమ్మిది రోజులైనా తెరదించుతోంది. కులాలకు అతీతంగా సమాజం సమానత్వాన్ని, భిన్నత్వంలోని ఏకత్వాన్ని కనబరుస్తోంది. దేశమంటే మట్టి కాదోయ్ అని, దేవుడు చేసిన మనుషులోయ్ అని చెబుతోంది. మట్టితో చేసిన భగవంతుడి ఇమేజ్‌ల ముందు తమ ఇగోలను పక్కన పెట్టాలోయ్ అని సందేశమిస్తోంది. చివరికి అంతా ఆ మట్టిలో కలిసిపోయేదే కదా అనే ఆధ్యాత్మిక చింతనను పెంపొందిస్తోంది. జీవితసారం ఇదేనని బోధిస్తోంది.