NTV Telugu Site icon

Speaker Election: నేడు లోక్‌సభ స్పీకర్ ఎన్నిక.. బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీ వ్యూహాలు..

Speaker Election

Speaker Election

Speaker Election: నేడు లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరగబోతోంది. 50 ఏళ్ల తర్వాత తొలిసారి స్పీకర్ పోస్టు కోసం అధికార ఎన్డీయే, ప్రతిపక్ష ఇండియా కూటములు తమ అభ్యర్థుల్ని నామినేట్ చేశాయి. దీంతో రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామం ఎదురైంది. ఎన్డీయే తరుపున బీజేపీ ఎంపీ, మాజీ స్పీకర్ ఓం బిర్లను ప్రతిపాదించగా, ఇండియా కూటమి తరుపున కేరళకి చెందిన కాంగ్రెస్ ఎంపీ కే.సురేష్ పోటీ పడుతున్నారు.

తొలిసారిగా 1952లో లోక్‌సభ స్పీకర్ పదవికి ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో మౌలాంకర్ స్పీకర్‌గా విజయం సాధించారు. ఆ తర్వాత 1976లో జగన్నాథ్ రావుపై బలిరామ్ భగత్ విజయం సాధించారు. ఈ రెండింటి తరువాత ఇప్పడే తొలిసారిగా స్పీకర్ పోస్టు కోసం ఎన్నికలు అనివార్యమమైంది. సాధారణంగా లోక్‌సభ స్పీకర్ పోస్టును అధికార, ప్రతిపక్షాలు ఏకగ్రీవం చేయడం సంప్రదాయంగా వస్తోంది. అయితే, ఈ సారి ప్రతిపక్షాలు తమకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని పట్టుబట్టాయి. అందుకు అధికార పక్షం అంగీకరించకపోవడంతో ఇరు పక్షాలు ఎన్నికలకు వెళ్లాయి.

Read Also: IAS Srinivasa Raju took VRS: వీఆర్ఎస్‌ తీసుకున్న సీనియర్‌ ఐఏఎస్ ఆఫీసర్‌ శ్రీనివాసరాజు.. కారణం అదేనా..?

బలబలాలను పరిశీలిస్తే ప్రస్తుతం బీజేపీకి సొంతగా 240 ఎంపీల బలం ఉంది. మిత్రపక్షాలతో కలుపుకుంటే 293 ఎంపీల సంఖ్యా బలం ఉంది. దీనికి తోడు వైఎస్సార్సీపీకి చెందిన నలుగురు ఎంపీలు కూడా ఎన్డీయేకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. దీంతో బలం 297కి పెరిగింది. ఇక ఇండియా కూటమికి 233 ఎంపీల మద్దతు ఉంది. సభలో మొత్తం 543 సభ్యులు ఉంటే, ఇటీవల రాహుల్ గాంధీ వయనాడ్ సీటుకు రాజీనామా చేయడంతో ప్రస్తుతం 542 సభ్యులు ఉన్నారు. స్పీకర్ ఎన్నికకు అవసరమైన ఓట్లు 271. బలాబలాలను పరిశీలిస్తే ఎన్డీయే పక్షం సునాయాసంగా స్పీకర్ పోస్టుని కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఇండియా కూటమిలో స్పీకర్ పోటీ ప్రతిపాదన చిచ్చు పెట్టింది. ఏకపక్షంగా కాంగ్రెస్ వ్యవహరించిందని తృణమూల్ అసంతృప్తి వ్యక్తం చేసింది.