NTV Telugu Site icon

Maharashtra: ఔరంగజేబుపై ప్రశంసలు.. అబూ అజ్మీ ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు

Abuasimazmi

Abuasimazmi

మహారాష్ట్ర అసెంబ్లీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబును ప్రశంసించినందుకు సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే అబూ అజ్మీని మహారాష్ట్ర అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. ఓ వైపు ఔరంగజేబును ప్రశంసిస్తూ.. ఇంకోవైపు శంభాజీ మహారాజ్‌ను విమర్శిస్తూ అజ్మీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. అసెంబ్లీ సభ్యుడి హోదాకు ఈ వ్యాఖ్యలు తగినవి కావని.. ప్రజాస్వామ్య సంస్థను అవమానించడమేనని రాష్ట్ర మంత్రి చంద్రకాంత్ పాటిల్ అన్నారు.

ప్రస్తుతం మహారాష్ట్రలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. మార్చి 26న సమావేశాలు ముగియనున్నాయి. అయితే ఇటీవల ఓ సభలో ఔరంగజేబుపై ఆజ్మీ ప్రశంసలు కురిపించారు. దీంతో బుధవారం అసెంబ్లీలో అజ్మీకి వ్యతిరేకంగా మంత్రి చంద్రకాంత్ తీర్మానం ప్రవేశపెట్టారు. సభ్యత్వం రద్దు చేయాలని తీర్మానం ప్రవేశపెట్టగా.. మూజువాణి ఓటుతో అసెంబ్లీ ఆమోదించింది. దీంతో అజ్మీ శాసనసభ సభ్యత్వం రద్దైంది.

అజ్మీ ఏమన్నారంటే..
ఔరంగజేబు పాలనలో భారతదేశ సరిహద్దు ఆఫ్ఘనిస్తాన్ మరియు బర్మా (మయన్మార్) వరకు ఉందని సమాజ్‌వాదీ పార్టీ మహారాష్ట్ర అధ్యక్షుడు అజ్మీ అన్నారు. ‘‘మన జీడీపీ (ప్రపంచ జీడీపీలో) 24 శాతం వాటా కలిగి ఉంది. ఔరంగజేబు పాలనలో భారతదేశాన్ని బంగారు పిచ్చుక అని పిలిచేవారు.’’ అని ఎమ్మెల్యే అజ్మీ పేర్కొన్నారు.

అజ్మీ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. ఉభయ సభలను కుదిపేశాయి. ఆయనను సస్పెండ్ చేయాలని, ఆయనపై రాజద్రోహం కేసు నమోదు చేయాలని పాలక పక్ష సభ్యులు డిమాండ్ చేశారు. అజ్మీ వ్యాఖ్యలు.. శాసనసభ సభ్యుడి హోదాకు తగినవి కావని.. శాసనసభ ప్రజాస్వామ్య సంస్థను అవమానించడమేనని అధికార నేతలు ధ్వజమెత్తారు.

అయితే తన వ్యాఖ్యలను వక్రీకరించారని.. అయినా అసెంబ్లీలో కాకుండా.. బయట ఎక్కడో మాట్లాడిన వ్యాఖ్యలను సభలోకి తీసుకురావడం సరైంది కాదని అజ్మీ తెలిపారు. ఔరంగజేబు గురించి చెప్పినదంతా చరిత్రకారులు, రచయితలు చెప్పినదే తాను వ్యాఖ్యానించినట్లు క్లారిటీ ఇచ్చారు. తాను ఎవరి గురించి అవమానకరమైన వ్యాఖ్యలు చేయలేదన్నారు. అయినా తన వ్యాఖ్యల వల్ల బాధపడుంటే వెనక్కి తీసుకుంటానని అజ్మీ తెలిపారు.