Southern Zonal Council Meeting: దక్షిణ మండలి సమావేశం ఈసారి కీలక రాజకీయ, ఆర్థిక అంశాలకు వేదికగా మారింది. డీలిమిటేషన్, కేంద్ర నిధుల పంపకం, రాష్ట్రాల హక్కులు, నదుల అనుసంధానం, అభివృద్ధి, కనెక్టివిటీ వంటి అంశాలపై దక్షిణాది రాష్ట్రాల నేతలు తమ అభిప్రాయాలను బలంగా వినిపించారు. రాష్ట్రాల ప్రత్యేక ప్రయోజనాలతో పాటు కేంద్రం ముందు సమిష్టిగా తమ డిమాండ్లను ఉంచే వేదికగా ఈ సమావేశం కనిపించింది. మొత్తంగా సీట్లు తగ్గొద్దు.. నిధులు తగ్గొద్దు.. రాష్ట్రాల హక్కులు తగ్గొద్దు అన్న సందేశం బలంగా వినిపించింది.
డీలిమిటేషన్‌పై దక్షిణాది ఆందోళన
జనాభా నియంత్రణలో ముందున్న దక్షిణాది రాష్ట్రాలకు డీలిమిటేషన్ కారణంగా రాజకీయంగా నష్టం జరగకూడదన్న అభిప్రాయం సమావేశంలో ప్రధానంగా వ్యక్తమైంది. కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ 1971 జనాభా లెక్కలను ప్రాతిపదికగా కొనసాగించాలని కోరారు. ప్రస్తుత లోక్‌సభలోని 543 స్థానాలను యథాతథంగా కొనసాగిస్తూ, అదే స్థానాల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని ప్రతిపాదించారు. జనాభా నియంత్రణను విజయవంతంగా అమలు చేసిన రాష్ట్రాల పార్లమెంటరీ ప్రాతినిధ్యం తగ్గితే అన్యాయం జరుగుతుందని డీకే శివకుమార్ పేర్కొన్నారు. ఆర్థిక ప్రాధాన్యానికి తగ్గట్టుగానే రాజకీయ ప్రాతినిధ్యం ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. తమిళనాడు రాజకీయ నేత విజయ్ కూడా పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గకుండా చట్టబద్ధమైన హామీ అవసరమని డిమాండ్ చేశారు.
నిధుల పంపకంపై దక్షిణాది గళం
ఆర్థిక సంఘం నిధుల పంపకంలో దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం చేయాలన్న డిమాండ్ కూడా సమావేశంలో ప్రధానంగా వినిపించింది. 15వ ఆర్థిక సంఘం సమయంలో కర్ణాటక వాటా 4.7 శాతం నుంచి 3.6 శాతానికి తగ్గిందని డీకే శివకుమార్ వెల్లడించారు. దీంతో ఆరేళ్లలో రాష్ట్రానికి సుమారు రూ.65 వేల కోట్ల నష్టం జరిగిందని ఆయన ఆరోపించారు. కర్ణాటకకు సిఫారసు చేసిన రూ.5,495 కోట్ల ప్రత్యేక గ్రాంటు విడుదల కాలేదని, మరో రూ.6 వేల కోట్ల రాష్ట్ర ప్రత్యేక గ్రాంటు కూడా అందలేదని డీకే పేర్కొన్నారు. 16వ ఆర్థిక సంఘంలో కర్ణాటక వాటా 4.131 శాతానికి పెరిగినప్పటికీ, తమ వాటాను తిరిగి 4.7 శాతానికి పెంచాలని రాష్ట్రం కోరుతోంది.
కావేరిపై భిన్న స్వరాలు
నీటి సమస్యలపై దక్షిణాది రాష్ట్రాల మధ్య భిన్న అభిప్రాయాలు కూడా సమావేశంలో స్పష్టమయ్యాయి. నీటి పంపకాల వివాదాల నుంచి నీటి సహకారం వైపు వెళ్లాల్సిన అవసరం ఉందని డీకే శివకుమార్ అన్నారు. సమానత్వం, పారదర్శకత, పరస్పర సహకారంతో నీటి సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. కావేరి, కృష్ణా, తుంగభద్ర, పెన్నా, పాలార్ వంటి నదులు దక్షిణాది ప్రజల జీవనాడులని పేర్కొన్న ఆయన.. కృష్ణా, అప్పర్ భద్ర, నదుల అనుసంధానం వంటి అంశాలపై కర్ణాటక తన వైఖరిని స్పష్టం చేస్తుందని తెలిపారు. మరోవైపు కావేరి జలాల విషయంలో సుప్రీంకోర్టు తీర్పులు, సంబంధిత అథారిటీల నిర్ణయాలను అమలు చేయాలని తమిళనాడు సీఎం విజయ్ డిమాండ్ చేశారు. ముల్లైపెరియార్ జలాశయం నీటిమట్టాన్ని 152 అడుగులకు పెంచే విషయంలోనూ కోర్టు తీర్పులకు కట్టుబడి ఉండాలని ఆయన స్పష్టం చేశారు.
చంద్రబాబు.. అభివృద్ధి, కనెక్టివిటీపై ఫోకస్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం దక్షిణాది అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ, నదుల అనుసంధానంపై ప్రధానంగా దృష్టి పెట్టారు. ఏపీ–కర్ణాటక–తమిళనాడు రాష్ట్రాలను అనుసంధానించే బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనను ఆయన ముందుకు తెచ్చారు. కుప్పం మీదుగా అమరావతి–బెంగళూరు–చెన్నై రవాణా కారిడార్ అభివృద్ధి చేయాలని సూచించారు. దక్షిణాది రాష్ట్రాల ఉమ్మడి లాజిస్టిక్స్ నెట్‌వర్క్, డ్రైపోర్టుల ఏర్పాటు, దక్షిణాది విద్యుత్ గ్రిడ్‌ను జాతీయ గ్రిడ్‌తో అనుసంధానం చేయడం వంటి ప్రతిపాదనలు చేశారు. రాష్ట్రాల యూనివర్సిటీలు, స్కిల్లింగ్ సంస్థలతో ఉమ్మడి కన్సార్టియం ఏర్పాటు చేయాలని, విపత్తుల సమయంలో పరస్పర సహకారం కోసం మ్యూచువల్ ఎయిడ్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. తిరుపతి నుంచి కాశీ, అయోధ్య, చార్‌ధామ్ వరకు ఉమ్మడి ఆధ్యాత్మిక పర్యాటక సర్క్యూట్ అభివృద్ధి చేయాలని చంద్రబాబు ప్రతిపాదించారు. 2047 నాటికి దక్షిణాది ఆర్థిక వ్యవస్థ 10 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
ఏపీ ప్రయోజనాలపైనా చంద్రబాబు ప్రత్యేక దృష్టి
దక్షిణాది ఉమ్మడి అంశాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పెండింగ్ సమస్యలను కూడా చంద్రబాబు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10 సంస్థల విభజన సమస్యలను పరిష్కరించాలని కోరారు. 12 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర విభజన సమస్యలపై కేంద్రం వేగంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం, సౌత్ కోస్ట్ రైల్వే జోన్, అమరావతి ప్రాజెక్టులకు కేంద్ర సహకారం అవసరమని పేర్కొన్నారు. దుగ్గరాజపట్నం పోర్టు, రిఫైనరీకి త్వరగా అనుమతులు ఇవ్వాలని కోరారు. విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు కేంద్ర అనుమతులు ఇవ్వాలని, కడప జేఎస్‌డబ్ల్యూ రైల్వే లింక్‌కు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
గోదావరి–కావేరి అనుసంధానానికి ప్రతిపాదన
దక్షిణాది జల సమస్యలకు పరిష్కారంగా నదుల అనుసంధానంపై చంద్రబాబు మరోసారి దృష్టి సారించారు. గోదావరి–కావేరి అనుసంధానం ద్వారా 500 టీఎంసీలకు పైగా నీటిని మళ్లించే ప్రతిపాదనను ప్రస్తావించారు. తమిళనాడు నీటి సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారంగా నదుల అనుసంధానాన్ని పరిశీలించాలని సూచించారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు జలాల విషయంలో సమన్వయంతో ముందుకు వెళ్లాలని కోరారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని గంగా–కావేరి అనుసంధానానికి దీర్ఘకాలిక జాతీయ ప్రణాళిక అవసరమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
కేంద్ర నిధులపై కేరళ అసంతృప్తి
కేరళ కూడా కేంద్ర నిధుల పంపకం, తీర రక్షణ, ఆఫ్‌షోర్ మైనింగ్ అంశాలను సమావేశంలో ప్రస్తావించింది. ఆయుష్మాన్ భారత్ పథకం కింద రాష్ట్రం భారీగా ఖర్చు చేస్తున్నప్పటికీ కేంద్రం నుంచి తగినంత నిధులు రావడం లేదని కేరళ అసంతృప్తి వ్యక్తం చేసింది. రూ.1,493 కోట్లు ఖర్చు చేస్తే కేంద్రం కేవలం రూ.151 కోట్లు మాత్రమే ఇచ్చిందని ఆ రాష్ట్రం పేర్కొంది. కేరళ తీర ప్రాంతంలో 63 శాతం మేర కోతకు గురవుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. తీర రక్షణ కోసం NDRF, SDRF నిధులను వినియోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది. శాస్త్రీయ అధ్యయనాలు, సరైన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ లేకుండా ఆఫ్‌షోర్ మైనింగ్ బ్లాకుల వేలం నిర్వహించవద్దని డిమాండ్ చేసింది. మైనింగ్ వల్ల తీర ప్రాంత పర్యావరణానికి ముప్పు ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది.
దక్షిణాది రాష్ట్రాల సమిష్టి స్వరం
డీలిమిటేషన్, ఆర్థిక సంఘం నిధులు, నీటి పంపకాలు, రాష్ట్రాల హక్కులు వంటి అంశాల్లో రాష్ట్రాల మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ.. కేంద్రంతో సంబంధించి తమ ప్రయోజనాల విషయంలో దక్షిణాది రాష్ట్రాలు సమిష్టిగా గళం వినిపించాయి. మరోవైపు డ్రగ్స్, అంతర్రాష్ట్ర నేరాల నియంత్రణకు రియల్‌టైమ్ ఇంటెలిజెన్స్ షేరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న సూచన కూడా వచ్చింది. మొత్తంగా చెన్నైలో జరిగిన దక్షిణ మండలి సమావేశం కేవలం రాష్ట్రాల సమస్యల చర్చకే పరిమితం కాకుండా.. దక్షిణాది రాజకీయ ప్రాతినిధ్యం, ఆర్థిక హక్కులు, అభివృద్ధి, నీటి వనరులు, కనెక్టివిటీ వంటి అంశాలపై భవిష్యత్‌లో సమిష్టి వ్యూహానికి వేదికగా మారే సంకేతాలను ఇచ్చింది.

