తాను కొత్త ప్రయాణం ప్రారంభించబోతున్నానని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ట్వీట్ చేయడమే ఆలస్యం.. అతడు రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నాడా? అనే చర్చలు జాతీయంగా మొదలైపోయాయి. ఆల్రెడీ గంగూలీ పలుసార్లు కేంద్ర హోంమంత్రిని కలవడం, ముఖ్యంగా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌కు ఆయన రావడంతో.. గంగూలీ పొలిటికల్ ఎంట్రీ ఖాయమని, ఆయన బీజేపీలో చేరనున్నారని దాదాపు అందరూ ఫిక్సయ్యారు. అతని చేసిన ట్వీట్‌లో ‘చాలామందికి ఉపయోగపడే ఓ మహత్తర కార్యక్రమానికి తెరతీస్తున్నా’ అని పేర్కొనడం.. రాజకీయ అరంగేట్ర ప్రచారానికి మరింత బలం చేకూర్చింది.
అయితే.. ఆ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని గంగూలీ క్లారిటీ ఇచ్చాడు. పొలిటికల్ ఎంట్రీపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించాడు. ‘కొత్త ప్రయాణం’ అంటూ తాను చేసిన ట్వీట్‌ను కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించారని ఆగ్రహించాడు. తాను ఓ ఎడ్యుకేషనల్ యాప్‌ను ప్రారంభించానని, ఇది ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంటుందని ఆయన వివరణ ఇచ్చాడు. తాను యధాతథంగా బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగుతానని స్పష్టం చేశాడు. ఇదే విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా కూడా దృవీకరించారు. దీంతో గంగూలీ రాజకీయ రంగ ప్రవేశంపై జరుగుతున్న ప్రచారానికి తెరపడినట్లైంది.
