Mahua Moitra: ‘క్యాష్ ఫర్ క్వేరీ’ కేసులో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా నేడు పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ ముందు హాజరయ్యారు. పార్లమెంట్ లో ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి ఆమె డబ్బులు, గిఫ్టులు తీసుకున్నట్లు బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపించించారు. అంతే కాకుండా ఆమెకు సంబంధించిన పార్లమెంట్ లాగిన్ ఐడీ వివరాలను ఇతరులతో పంచుకున్నారని, దుబాయ్ వేదికగా పలుమార్లు లాగిన్ అయినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ ముందు హాజరై తన వాదనల్ని వినిపించారు.
ఎంపీ మహువా మోయిత్రా ఈ రోజు ఎథిక్స్ కమిటీ ముందు ‘‘వ్యక్తిగత సంబంధం’’లోని అపార్థాలే తనపై క్యాష్ ఫర్ క్వేరీ కేసుకు కారణమైనట్లు తెలిపిందని విశ్వసనీయ వర్గాలు వెల్లడదించాయి. వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీకి తన అధికార లాగిన్ వివరాలు ఇచ్చినట్లు ఆమె అంగీకరించిందని, అయితే ప్రశ్నలు తనవే అని అన్నారు. కేంద్ర హోం, ఐటీ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల నుంచి వచ్చిన వివరాలను, ఇతర సాక్ష్యాల ఆధారంగా ఎథిక్స్ ప్యానెట్ ఆమెను ప్రశ్నిస్తోంది. ఆమె ఇచ్చిన వాంగ్మూలాన్ని క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తోంది.
Read Also: BJP 3rd list: బీజేపీ మూడో విడత ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల
అయితే ప్రతిపక్ష ఎంపీలు మహువా మోయిత్రాకు మద్దతు నిలిచినట్లు సమాచారం. ఈ కేసుకు మూలం అయిన డబ్బు ఎక్కడ ఉందని ఆరా తీశారు. ఎంపీలు ఎవరి సాయం లేకుండా తమ ప్రశ్నలు పార్లమెంట్ వెబ్‌సైట్ లో పోస్టు చేస్తారా..? అని ప్రశ్నించినట్లు సమాచారం. ప్రశ్నలను పోస్ట్ చేయడానికి మాత్రమే లాగిన్ ఉపయోగపడుతుందని, ఇందులో జాతీయ భద్రత సమస్య లేదని ప్రతిపక్ష ఎంపీలు తెలిపారు. అధికారిక లాగిన్ పంచుకోవడంపై బీజేపీ జాతీయ భద్రతా ఆందోళనల్ని లేవనెత్తింది.
మహువా మోయిత్రా డబ్బులు తీసుకుని పార్లమెంట్ లో ప్రధాని మోడీ టార్గెట్‌గా అదానీ వ్యవహారంపై ప్రశ్నలు అడిగారనే ఆరోపణలు ఉన్నాయి. ఆమె ఇండియాలో ఉన్న సమయంలోనే దుబాయ్ నుంచి లాగిన్ అయినట్లు ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపించారు. ఇదిలా ఉంటే ఈ కేసులో వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ ఎథిక్స్ ప్యానెట్‌కి అఫిడవిట్ సమర్పించారు. ఇందులో తన వద్ద నుంచి మోయిత్రా డబ్బులు, గిఫ్టులు తీసుకుందని అందులో ఆరోపించారు.