NTV Telugu Site icon

Sonia Gandhi: కాంగ్రెస్ ఒక పార్టీ మాత్రమే కాదు.. చెక్కు చెదరని ఉద్యమం

Sonia Gandhi Speech

Sonia Gandhi Speech

Sonia Gandhi Speech In Mallikarjun Kharge Oath Ceremony: తమ కాంగ్రెస్ ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదు.. ఓ చెక్కు చెదరని ఉద్యమంలా ఏళ్ల తరబడి నిలిచిందని సోనియా గాంధీ పేర్కొన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గే బాధ్యతలు చేపట్టిన కార్యక్రమంలో ప్రసంగించిన ఆమె.. కాంగ్రెస్‌ ఎన్నో సవాళ్లను, ప్రమాదాలను ఎదుర్కొందని.. కానీ, ఏనాడూ ఓటమిని అంగీకరించలేదని అన్నారు. భవిష్యత్తులో కూడా విజయం సాధిస్తామని నమ్మకం వెలిబుచ్చారు. పార్టీ ఎదుట చాలా సవాళ్లు ఉన్నాయని.. ఈ సవాళ్లను తాము పూర్తి శక్తిసామర్థ్యాలతో, ఐకమత్యంతో ఎదుర్కొంటామని వెల్లడించారు. అందరం కలిసి తమ లక్ష్యాలను సాధిస్తామని జోష్ నింపారు.

ఇక ఏఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఖర్గేకు సోనియా గాంధీ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆయన చాలా అనుభవజ్ఞుడైన నాయకుడని, స్వయంకృషితో సాధారణ కార్యకర్త నుంచి పార్టీ అధ్యక్షుడి స్థాయికి ఎదిగారని, పార్టీ కార్యకర్తలకు స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. ఇప్పుడు తాను ఆ బాధ్యతల నుంచి వైదొలగడంతో.. కొంత ఉపశమనం లభించిందని, మార్పు ప్రకృతి ధర్మమని అన్నారు. పార్టీ కోసం తాను పూర్తి స్థాయిలో పని చేశానని, ఈరోజుతో తనకు బాధ్యతల నుంచి విముక్తి కలగడంతో తన భుజాల మీద ఎంతో బరువు తొలగిపోయినట్టుగా ఉందని పేర్కొన్నారు. ఇన్నేళ్లు తనకు మద్దతుగా నిలిచిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అధ్యక్ష ఎన్నికను సజావుగా నిర్వహించినందుకు మధుసూదన్‌ మిస్త్రీకి ధన్యవాదాలు చెప్పారు.

కాగా.. కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం శశి థరూర్, మల్లికార్జున్ ఖర్గే పోటీ చేయగా.. భారీ మెజారిటీతో ఖర్గే విజయం సాధించారు. గాంధీ కుటుంబంతో పాటు సీనియర్లందరూ ఖర్గేకి మద్దతు తెలపడంతో, ఈ ఎన్నికల్లో ఆయన సునాయాసంగా గెలుపొందారు. అయితే.. గాంధీలకు విదేయుడిగా ఉన్నాడు కాబట్టి ఈ ఎన్నికల్లో ఖర్గే గెలిచాడన్న విమర్శలు వచ్చాయి. ఏదేమైనా.. దాదాపు 23 ఏళ్ల తర్వాత గాంధీయేతరులు కాంగ్రెస్ బాధ్యతలను చేపట్టారు.