NTV Telugu Site icon

Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో పాల్గొన్న సోనియాగాంధీ.

Bharat Jodo Yatra

Bharat Jodo Yatra

Sonia Gandhi Joins Bharat jodo Yatra: కాంగ్రెస్ గత వైభవం కోసం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ‘ భారత్ జోడో యాత్ర’ చేపట్టింది. వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారు. ఈ యాత్రకు ప్రజల నుంచి స్పందగ బాగానే వస్తోంది. సెప్టెంబర్ 7న తమిళనాడు కన్యాకుమారిలో ప్రారంభం అయిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం కర్ణాటకలో జరుగుతోంది. గురువారం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీతో కలిసి నిడిచారు.

బీజేపీ పాలిత రాష్ట్రం కర్ణాటకలో సోనియాగాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్ జోడో యాత్ర ప్రారంభంలో అనారోగ్య కారణాల వల్ల ఆమె విదేశాల్లో చికిత్స తీసుకున్నారు. భారత్ వచ్చాక ఇప్పుడే తొలిసారిగా పాదయాత్రలో పాల్గొన్నారు. గురువారం మాండ్యా జిల్లాలో జరిగిన యాత్రలో సోనియాగాంధీ, కుమారుడు రాహుల్ గాంధీతో జోడో యాత్రలో చేరారు. బళ్లారిలో జరిగే ర్యాలీలో ఆమె ప్రసంగించే అవకాశం ఉంది.

విజయదశమి సందర్భంగా రెండు రోజుల పాటు భారత్ జోడో యాత్రకు విరామం ఇచ్చారు. విరామం తరువాత గురువారం యాత్ర తిరిగి ప్రారంభం అయింది. సోనియాగాంధీతో పాటు స్థానిక మహిళా ఎమ్మెల్యే అంజలి నింబార్కర్, రూపకళ, లక్ష్మీ హెబ్బాల్కర్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు రోజు దసరా సందర్భంగా సోనియా గాంధీ మైసూర్ లోని దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

తమిళనాడులో ప్రారంభం అయిన యాత్ర కేరళలో ముగిసి కర్ణాటకలో కొనసాగుతోంది. 21 రోజుల పాటు 511 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగనుంది. చామరాజనగర్, మైసూరు, మాండ్య, తుమకూరు, చిత్రదుర్గ, బళ్లారి మరియు రాయచూరు జిల్లాల గుండా పాదయాత్ర కొనసాగనుంది. తమిళనాడులో సెప్టెంబర్ 7న ప్రారంభం అయిన కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల గుండా 3570 కిలోమీటర్ల మేర సాగుతుంది. ఐదు నెలల తర్వాత కాశ్మీర్ లో ఈ యాత్ర ముగుస్తుంది.