Site icon NTV Telugu

Sonia Gandhi: ఈడీ విచారణకు హాజరైన సోనియాగాంధీ.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు

Sonia Gandhi Appear Before Ed

Sonia Gandhi Appear Before Ed

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి ఈడీ విచారణకు హాజరయ్యారు.  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ కూడా ఈ విచారణకు హాజరయ్యారు.  ఈడీ అధికారులు సోనియాగాంధీని విచారిస్తున్నారు.  విచారణ సమయంలో రాహుల్, ప్రియాంకలు వేరే ప్రత్యేక రూమ్‌లో వేచి ఉండాల్సి ఉంటుంది. అనారోగ్యంగా అనిపిస్తే సోనియా గాంధీ ఇంటికి వెళ్లిపోవచ్చునని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వర్గాలు చెబుతున్నాయి. అనారోగ్యం దృష్ట్యా ఒక మెడికల్ ఆఫీసర్‌ని కూడా ఈడీ కార్యాలయంలోకి అనుమతిస్తారు. అయితే విచారణ సమయంలో సోనియా పక్కన కూర్చుకోవడానికి వీల్లేదు. సోనియా గాంధీ లాయర్ కూడా ఆమె వెంట ఉండొచ్చు. కానీ విచారణలో ప్రశ్నలు సంధించే సమయంలో ఆమె పక్కన ఉండరాదని ఈడీ అధికారులు చెప్పారు.

మరోవైపు సోనియా గాంధీ ఈడీ విచారణ నేపథ్యంలో కాంగ్రెస్ దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది.  దాంతో పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ నేపథ్యంలో న్యూఢిల్లీలోని ఈడీ కార్యాలయం ఎదుట భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌ ఆంక్షలను కఠినతరం చేశారు.

నేషనల్ హెరాల్డ్ కేసులో అక్రమ నగదు చలామణికి పాల్పడిన అభియోగంపై ప్రశ్నించేందుకు ఆమెకు ఈడీ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ)లోని క్రిమినల్‌ సెక్షన్ల కింద ఆమె వాంగ్మూలాలను ఈడీ అధికారులు నమోదు చేయనున్నారు. నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికలో సోనియా, రాహుల్‌ల షేర్లు, ఆర్థిక లావాదేవీలు, వీరి పాత్రలకు సంబంధించి ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఈ నేపథ్యంలో సోనియా గాంధీకి మద్దతుగా దేశవ్యాప్తంగా నిరసనలో భాగంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు నినాదాలు చేశారు.

Sailajanath: సోనియాగాంధీపై ఈడీ విచారణ కుట్రే

దర్యాప్తు సంస్థల దుర్వినియోగం ద్వారా మోడీ సర్కార్ తన రాజకీయ ప్రత్యర్థులు, విమర్శకులపై ఎడతెగని ప్రతీకార ప్రచారం ప్రారంభించిందని విపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా అనేక రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖ నేతలను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేసి వేధిస్తోందని మండిపడ్డాయి. సామాజిక నిర్మాణాన్ని నాశనం చేస్తున్న మోడీ సర్కార్ ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక , రాజ్యాంగ వ్యతిరేక విధానాలపై పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని విపక్ష పార్టీలు ఉమ్మడి ప్రకటనను విడుదల చేశాయి.

 

Exit mobile version