Sonakshi Sinha: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తన తల్లిదండ్రులు సోనియా గాంధీ, రాజీవ్ గాంధీల ప్రేమబంధం గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. దీనిపై బీజేపీ విమర్శలు చేస్తోంది. భోజన సమయంలో తన తల్లి తన తండ్రి ఒడిలో కూర్చుని ఉండేదని రాహుల్ అన్నారు. తన తల్లి సోనియా గాంధీ రచించిన Belonging: A Journey of Love పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉంటే, ఈ వ్యాఖ్యలపై బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా స్పందించారు. రాహుల్ గాంధీకి మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. రాహుల్ వ్యాఖ్యలపై విమర్శలు చేస్తున్న వారిపై పరోక్షంగా ప్రశ్నిస్తూ.. ‘‘భవిష్యత్తులో తన పిల్లలు కూడా తల్లిదండ్రుల మధ్య ఇలాంటి ప్రేమాభిమానాలు చూడబోతున్నారు’’ అని సరదాగా వ్యాఖ్యానించారు. సోనాక్షి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఇలా రియాక్ట్ అయ్యారు. భోజన సమయంలో సోనియా గాంధీ రాజీవ్ గాంధీ ఒడిలో కూర్చోవడంపై కొందకు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అని పోస్టులో ప్రశ్నించారు. ప్రేమలేని, పితృస్వామ్య భావజాలంతో నిండిన వివాహ బంధాలకు అలవాటుపడిన వారికి భార్యాభర్తలు ఒకరినొకరు ప్రేమించుకోవడం కూడా సామాజిక నిబంధనలకు విరుద్ధంగా కనిపిస్తుందని ఆమె అన్నారు.
రాహుల్ గాంధీ ఏమన్నారు..?
సోనియా గాంధీ పుస్తక ఆవిష్కరణలో రాహుల్ గాంధీ తన తల్లిదండ్రుల ప్రేమ గురించి మాట్లాడుతూ.. “ప్రతి భోజన సమయంలో నాన్నఒడిలో అమ్మ కూర్చుని ఉండేవారు. ఇది చాలా సాధారణమైన విషయమని నేను అనుకునేవాడిని. అయితే నా స్నేహితుల ఇళ్లకు వెళ్లినప్పుడు వారి తల్లిదండ్రులు అలా ఒకరి ఒడిలో మరొకరు కూర్చునేవారు కాదు. అప్పుడు నా స్నేహితులను.. మీ అమ్మ మీ నాన్న ఒడిలో ఎందుకు కూర్చోవడం లేదు? అసలు మీ ఇంట్లో ఏం జరుగుతోంది? అని అడిగేవాడిని. మేము ఇలాంటి వాతావరణంలోనే పెరిగాం” అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ విమర్శలు చేస్తోంది.

