NTV Telugu Site icon

Education Minister: ‘‘కొంతమంది విద్యార్థులు లవ్ ఎఫైర్స్ వల్ల మరణిస్తున్నారు’’.. కోట సూసైడ్‌‌పై వ్యాఖ్యలు..

Rajastahn

Rajastahn

Education Minister: కోచింగ్ సెంటర్లకు కేరాఫ్‌గా ఉన్న రాజస్థాన్ కోటా పట్టణంలో గత కొన్నేళ్లుగా విద్యార్థుల ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఒత్తిడికి లోనవుతున్న విద్యార్థులు తనువు చాలిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ ఆత్మహత్యలపై రాజస్థాన్ విద్యా శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి. ఈ ఆత్మహత్యలకు విద్యాపరమైన ఒత్తిడి, కొన్ని సందర్భాల్లో ప్రేమ వ్యవహారాలు కూడా కారణమవుతున్నాయని అన్నారు.

రాష్ట్రంలోని బుండిలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి మదన్ దిలావర్ మాట్లాడారు. విద్యార్థుల ఆత్మహత్యల గురించి ప్రశ్నించగా..‘‘ తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ఎక్కువ శ్రద్ధ వహించాలని, వారు చదువుల్లో రాణించడానికి వారిపై అధిక ఒత్తిడి పెట్టకుండా ఉండాలి’’ అని దిలావర్ అన్నారు.

Read Also: Mahakumbh Mela: సీఎం యోగితో ఇటలీ బృందం భేటీ.. ఎంత చక్కగా “రామభజన” పాడారో చూడండి..

‘‘నా మాటలు కొంతమందికి చికాకు కలిగించినప్పటికీ, తల్లిదండ్రులు శ్రద్ధగా, జాగ్రత్తగా ఉండాలని, తమ పిల్లపై ఎక్కువ ఒత్తిడి పెట్టొద్దని నేను నిజాయితీగా కోరుతున్నాను’’ అని మంత్రి కోరారు. కొన్ని సందర్భాల్లో ప్రేమ వ్యవహారాలు కూడా ఆత్మహత్యలకు కారణమవుతున్నాయని చెప్పారు. అలాంటి సంబంధాల్లో ఉండే విద్యార్థులు భావోద్వేగ సమస్యల్ని ఎదుర్కోవచ్చని, కొన్నిసార్లు ఆత్మహత్య వంటి తీవ్రమైన చర్యలకు దారి తీయొచ్చని చెప్పారు.

“కోచింగ్ సెంటర్లలోనే కాదు, ప్రతిచోటా ప్రజలు ఆత్మహత్య చేసుకోకుండా ఉండటానికి ప్రభుత్వం తన శాయశక్తులా ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలోని సంఖ్యలతో పోలిస్తే ఆత్మహత్యల సంఖ్య అంత ఎక్కువగా లేదు. ఆత్మహత్యలకు కోచింగ్ సెంటర్లను నేను నిందించను,’’ అని అన్నారు.

విద్యార్థులకు పోటీ పరీక్షలకు సిద్ధం చేసే కోచింగ్ సెంటర్లకు కోటా ప్రసిద్ధి చెందింది. అయితే, విద్యార్థుల ఆత్మహత్యలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. నివేదికల ప్రకారం, 2025లో ఇప్పటికే నలుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని మరణించారు. 2024లో, కనీసం 20 ఇలాంటి సంఘటనలు నమోదయ్యాయి. 2023లో ఆత్మహత్యల సంఖ్య 27గా ఉంది.