PM Narendra Modi: బీజేపీ మాత్రమే పాన్ ఇండియా పార్టీ అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఓ కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. రాజకీయ సంస్థ నుంచి ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా ఎదిగేందుకు పార్టీ కార్యకర్తల అంకితభావం, త్యాగాలే కారణం అని ఆయన అన్నారు. కుటుంబ నియంత్రణలో ఉన్న పలు రాజకీయ పార్టీ మధ్య బీజేపీ మాత్రమే పాన్ ఇండియా పార్టీ అని అభివర్ణించారు. బీజేపీ అత్యంత భవిష్యత్ వాద పార్టీగా అవతరించిందని ఆయన అన్నారు.
బీజేపీ కేవలం రెండు లోక్ సభ స్థానాల నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించి 2019లో 303 స్థానాలకు చేరుకుందని, చాలా రాష్ట్రాల్లో బీజేపీకి 50 శాతానికి పైగా ఓట్లు వచ్చాయని ఆయన అన్నారు. ఉత్తరం నుంచి దక్షిణం, తూర్పు నుంచి పడమర వరకు బీజేపీ మాత్రమే ఉందని ఆయన అన్నారు. ఆధునిక, అభివృద్ధి చెందిన భారతదేశమే తమ లక్ష్యం అని ప్రధాని వెల్లడించారు. మనకు రాజ్యాంగ సంస్థలు బలమైన పునాదిగా ఉన్నాయని, అందుకే భారత్ ను అడ్డుకునేందుకు రాజ్యాంగ సంస్థలపై దాడులు చేస్తున్నారు. కేంద్ర ఏజెన్సీలు చర్యలు తీసుకుంటే దాడులు జరుగుతున్నాయని, కోర్టులపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Strange Incident : ఒకే కాన్పులో నలుగురు.. ఎక్కడో కాదు మన దగ్గరే
బీజేపీ తెరపైనో, వార్తా పత్రికల్లోనో, ట్విట్టర్ హ్యాండిల్స్, యూట్యూబ్ ఛానెళ్ల నుంచి వచ్చిన పార్టీ కాదని, బీజేపీ కార్యకర్తలతో పురోగమించిందని ప్రధాని అన్నారు. ఏడు దశాబ్ధాల తర్వాత తొలిసారిగా అవినీతిపరులపై చర్యలు తీసుకుంటుంటే కొంతమంది కలత చెందుతున్నారని, కోపంతో ఉన్నారని వారి తప్పుడు ఆరోపణలపై చర్యలు ఆగవని ప్రతిపక్షాలకు క్లియర్ మెసేజ్ ఇచ్చారు ప్రధాని.
అవినీతిలో కూరుకుపోయిన వారంతా ఒకే వేదికపైకి వస్తున్నారని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నారు. అవినీతిపరుల మూలాలను కదిలించాం. మనీలాండరింగ్ చట్టం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 5 వేల కోట్లను జప్తు చేసిందని, బీజేపీ హాయాంలో దాదాపుగా 10,00,000 కోట్లు పట్టుబడ్డాయని, ఇరవై వేల మంది ఆర్థిక నేరస్థులు పట్టుబడ్డారని ప్రధాని అన్నారు.