NTV Telugu Site icon

Yogi Adityanath: “తాలిబాన్‌లకు బజరంగ్‌బలి” పరిష్కారం.. యోగీ సంచలన వ్యాఖ్యలు..

Yogi Adityanath

Yogi Adityanath

Yogi Adityanath: రాజస్థాన్‌లో ఎన్నికల ప్రచారంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. అల్వార్ లో బీజేపీ తరుపున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ఇజ్రాయిల్-గాజా యుద్ధాన్ని బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‌గా పోలుస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. గాజాలో తాలిబాన్ ఆలోచనలను ఎలా అణిచివేయబడుతుందో మీరు చూస్తున్నారా..? ఖచ్చితత్వంతో లక్ష్యాలను చేధిస్తున్నారని ఇజ్రాయిల్ ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. తాలిబాన్లకు బజరంగ్‌బలి విధానమే పరిష్కారమని ఆయన అన్నారు.

రాజస్థాన్ కాంగ్రెస్‌ని విమర్శిస్తూ.. అరాచకం, గుండాయిజం, ఉగ్రవాదం సమాజానికి శాపమని, రాజకీయాలు వాటిలో చిక్కుకున్నప్పుడు నాగరిక సమాజాన్ని ప్రభావితం చేస్తాయని యోగి అన్నారు. సర్దార్ పటేల్ కాశ్మీర్‌ని భారతదేశంలో అంతర్భాగంగా మార్చారు.. కానీ కాంగ్రెస్ నాయకుడు జవహర్ లాల్ నెహ్రూ సమస్య సృష్టించారని దుయ్యబట్టారు. దీని కారణంగానే ఉగ్రవాదం వ్యాపించిందని, బీజేపీ ప్రభుత్వం వచ్చార ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా కాశ్మీర్ లో ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు, సమస్యల్ని తీర్చేందుకు చర్యలు తీసుకున్నారని ఆయన అన్నారు.

Read Also: Infosys: నెలకు 10 రోజులు ఆఫీసుకు రండి.. ఉద్యోగుల్ని కోరిన ఇన్ఫోసిస్..

రాష్ట్రంలో మహిళలపై నేరాలు పెరుగుతున్నాయని రాజస్థాన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. కాంగ్రెస్ గెలిస్తే తాలిబాన్ మనస్తత్వం కారణంగా అక్కాచెల్లెళ్లు, కూతుళ్లు దోపిడికి గురవుతారని హెచ్చరించారు. అంతకుముందు ప్రధాని నరేంద్రమోడీ కూడా రాజస్థాన్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మహిళలు, దళితులపై అఘాయిత్యాలు జరిగాయని, ఈ ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని ప్రధాని ప్రజలను కోరారు.

నవంబర్ నెలలో 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల్లో ఇప్పటికే అన్ని పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. 2024 లోక్‌‌సభ ఎన్నికల ముందు వచ్చే ఎన్నికలు కావడంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి.