NTV Telugu Site icon

Arvind Kejriwal: నన్ను అవమానించడమే అరెస్ట్ ఏకైక లక్ష్యం.. బెయిల్‌పై విచారణ..

Arvind Kejriwal

Arvind Kejriwal

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై ఈ రోజు కోర్టులో వాదనలు జరిగాయి. బుధవారం కేజ్రీవాల్ ఈడీపై విరుచుకుపడ్డారు. ‘‘నన్ను అవమానించడం, అసమర్థుడిని చేయడమే అరెస్ట్ లక్ష్యమని’’ అని ఆయన ఆరోపించారు. ఢిల్లీ హైకోర్టులో మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు వినిపిస్తూ.. విచారణ, స్టేట్మెంట్, అరెస్టుకు ఆధారాలు లేకుండా ఈడీ వ్యవహరించిందని ఆయన అన్నారు. లోక్‌సభ ఎన్నికల ముందు కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేయడంపై ఆప్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బీజేపీ విజయం సాధించేందుకు ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు దిగిందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆప్‌ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కేజ్రీవాల్ ఆరోపించారు.

Read Also: Anasuya : అనసూయ లేటెస్ట్ లుక్స్ అదుర్స్.. హేటర్స్ కోసమే క్యాప్షన్ పెట్టిందా?

కేజ్రీవాల్ తరుపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. కేజ్రీవాల్‌కి వ్యతిరేకంగా ఈడీ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని, కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేస్తున్న సమయంలో ఆయన ఇంట్లో స్టేట్మెంట్ రికార్డ్ చేసే ప్రయత్నం చేయలేదని ఆయన అన్నారు. ఎన్నికల ముందు అరెస్ట్ చేయడాన్ని కోర్టు ముందు ఉంచారు. ఆమ్ ఆద్మీ పార్టీని పడగొట్టేందుకు అరెస్ట్ ఉద్దేశించబడిందని సింఘ్వీ వాదనలు వినిపించారు. కేజ్రీవాల్ కోర్టుకు వెళ్లిన తర్వాత కూడా ఈడీ పదేపదే సమన్లు జారీ చేయడాన్ని సింఘ్వీ ప్రశ్నించారు.

ప్రతిపక్ష ఇండియా కూటమిలో ఆప్ భాగంగా ఉంది. ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేయడంపై ఇండియా కూటమి నేతలు ఫైర్ అవుతున్నారు. గత ఆదివారం మహార్యాలీ పేరుతో కేజ్రీవాల్‌కి మద్దతుగా కూటమి నేతలు భారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇదిలా ఉంటే ఈ కేసులో కేజ్రీవాల్ కింగ్‌పిన్ అని ఈడీ ఆరోపిస్తోంది. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ కస్టడీపై తీహార్ జైలులో ఉన్నారు.