Site icon NTV Telugu

Snake Bite: పాము కాటుకు చికిత్స త్వరగా అందడం లేదు.. ఏటా 60వేల మంది మృతి

Snake Bite

Snake Bite

Snake Bite: పామును చూస్తే భయంతో పారిపోతాం. పాములు కూడా మనుషులను చూసి భయపడిపోతాయి. అనుకోకుండా పాము కాటేస్తే .. దానికి చికిత్స చేయించుకోవడానికి చూస్తాం. కానీ ఇప్పటికీ గ్రామాల్లో పాము కాటుకు నాటు వైద్యంపై ఆధారపడుతున్నారు తప్ప.. ఆసుపత్రికి తీసుకెళ్లడమో.. లేకపోతే సరైన చికిత్సను అందించడమో చేయడం లేదు. పాము కాటుకు ఆధునిక వైద్య విధానాలు అందుబాటులో ఉన్నా ఇప్పటికీ ఎంతో మంది ప్రజలు నాటు వైద్య విధానాలను విశ్వసిస్తున్నారు. ముఖ్యంగా పాముకాటుకు గురైనవారికి గోల్డెన్‌ అవర్స్‌లో అంటే తొలి 3 గంటల వ్యవధిలోగా మెరుగైన చికిత్స అందక ఏటా 60 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వీరిలో 75 శాతం నుంచి 80 శాతం మంది వైద్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్లనే మృత్యువాత పడుతున్నట్టు తాజా అధ్యయన నివేదికలో సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) తేల్చింది. అంతర్జాతీయ పాముల దినోత్సవం సందర్భంగా సీసీఎంబీ ఈ నివేదికను వెల్లడించింది. పాము కాటు బాధితులకు కొన్ని సందర్భాల్లో నాటు వైద్యం సత్ఫలితాలను ఇస్తున్నప్పటికీ క్లిష్ట సమయాల్లో ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోందని ఆ నివేదికలో పేర్కొన్నారు. మన దేశంలో 60 రకాలకుపైగా విషసర్పాలు మనుగడ సాగిస్తున్నాయి. వీటి కాటుకు గురైనవారిలో చాలా మందికి ప్రథమ చికిత్సపై అవగాహన లేకపోవడం, నాటు వైద్యాన్ని ఆశ్రయించడం, సకాలంలో మెరుగైన వైద్య చికిత్స చేయించుకోకపోడంతో పక్షవాతం, కణజాలం నిర్వీర్యమవడం, మెదడులో రక్తం గడ్డకట్టడం వలన 80 శాతం మేరకు మరణాలు సంభివిస్తున్నట్టు సీసీఎంబీ పేర్కొన్నది.

Read also: Naga Chaitanya: ఒకేసారి ఇద్దరు హిట్ డైరెక్టర్స్ తో అక్కినేని హీరో…

పాము కాటు బాధితులకు గోల్డెన్‌ అవర్స్‌ ముగిసేలోగా యాంటీ వీనమ్‌ డోస్‌ను అందించగలిగితే ఎన్నో మరణాలను నియంత్రించవచ్చని పరిశోధకులు చెప్తున్నారు. ప్రస్తుతం మన దేశంలో యాంటీ వీనమ్‌కు భారీ డిమాండ్‌ ఉన్నది. 80 శాతం యాంటీ వీనమ్‌ను తమిళనాడులోని ఇరులా సహకార సంఘం నుంచి సేకరిస్తున్నారు. అయితే పర్యావరణం మరియు భౌగోళిక అంశాలను బట్టి సర్పాల విషతీవ్రత భిన్నంగా ఉంటుందని.. ఈ నేపథ్యంలో స్థానిక పరిస్థితులను బట్టి ప్రాంతాలవారీగా యాంటీ వీనమ్‌ను తయారు చేయాల్సిన అవసరం ఉన్నదని పరిశోధకులు స్పష్టం చేశారు. కాబట్టి భవిష్యత్‌లో పాము కాటుకు గురైన వారు గోల్డెన్‌ హవర్‌ కాలంలో యాంటీ వీనమ్‌ డోస్‌ను అందించడానికి ప్రయత్నం చేయాలని సూచిస్తున్నారు.

Exit mobile version