NTV Telugu Site icon

Parliament Terror Attack: పార్లమెంట్ టెర్రర్ అటాక్ 22వ వార్షికోత్సవం.. ఖలిస్తానీ ఉగ్రవాది బెదిరించిన రోజే భద్రతా ఉల్లంఘన..

Parliament

Parliament

Parliament Terror Attack: పార్లమెంట్‌పై ఉగ్రవాద దాడిలో జరిగిన నేటికి 22వ వార్సికోత్సవం. ఈ ఘటన జరిగిన ఇదే రోజు మరోసారి భారత పార్లమెంట్‌పై మరోసారి దాడి జరిగింది. బుధవారం ఇద్దరు అగంతకులు పార్లమెంట్ లోపలకి ప్రవేశించి, ఎల్లో స్మోక్ బాంబులను విసిరారు. ఈ ఘటనలో తీవ్ర భద్రతా వైఫల్యం కనిపిస్తోంది. 2001లో పార్లమెంట్‌పై పాకిస్తాన్ ఆధారిత ఉగ్రసంస్థలు లష్కరేతోయిబా, జైషే మహ్మద్ దాడికి పాల్పడ్డాయి. ఈ ఘటనలో 9 మంది భద్రతా సిబ్బంది చనిపోగా.. ఐదుగురు ఉగ్రవాదుల్ని మట్టుపెట్టారు.

ఈ ఉగ్రదాడి జరిగి 22 ఏళ్ల గడిచిన ఈ రోజే ప్రధాని నరేంద్రమోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం జరిగిన తర్వాత పార్లమెంట్ ప్రారంభమైంది. ఈ సమయంలోనే విజిటర్‌గా వచ్చిన ఇద్దరు వ్యక్తులు గ్యాలరీ నుంచి దూకి నినాదాలు చేస్తూ, స్మోక్ బాంబుల్ని ప్రయోగించారు. దీంతో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ఈ ఘటనలో మొత్తం నలుగురిని అరెస్ట్ చేసి, విచారిస్తున్నారు.

Read Also: Siddharth: శివ కార్తికేయన్ కోసం ఏలియన్ గా మారిన సిద్ధార్థ్…

ఇదిలా ఉంటే ఇటీవల ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ పార్లమెంట్‌పై దాడికి పాల్పడుతామంటూ ఓ వీడియోలో హెచ్చరించారు. అతను హెచ్చరించిన ఇదే రోజు పార్లమెంట్లో భద్రత వైఫల్యం తలెత్తింది. పార్లమెంట్ పునాదిని కదిలిస్తా అని వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఢిల్లీ వ్యాప్తంగా పోలీసులు, పార్లమెంట్ భద్రతా సిబ్బంది అప్రమత్తమైనప్పటికీ ఈ దాడి జరగడం గమనార్హం.

ఏం జరిగింది:

ఈ రోజు మధ్యాహ్నం 1.02 గంటలకు ఒక వ్యక్తి విజిటర్ గ్యాలరీ నుంచి దూకి ఛాంబర్ లోకి పరిగెత్తడంతో లోక్‌సభలో గందరగోళం తలెత్తింది. ఇద్దరు వ్యక్తులు ఎల్లో కలర్ పొగను వెదజల్లారు. ఒక వ్యక్తిని పట్టుకునేందుకు ఎంపీలు ప్రయత్నించారు. వారి నుంచి తప్పించుకునేందుకు దుండగుడు డెస్కులపై నుంచి దూకాడు. ప్రతిపక్ష ఎంపీలు భద్రతా వైఫల్యంపై ప్రభుత్వాన్ని నిందించారు. దీనిపై సమగ్ర విచారణ జరుపుతామని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. పార్లమెంట్ వెలుపల మరో ఇద్దరు ఇలాగే పొగలు వెదజల్లుతూ నిరసన తెలిపారు. దుండగులను అమోల్ షిండే(25), నీలం(42)గా గుర్తించారు.