Modi-Ketan Agarwal: ప్రధాని, రాష్ట్రపతికి కేతన్ అగర్వాల్ కుటుంబం లేఖ.. ఏముందంటే..!

  • నా కొడుకుకు న్యాయం చేయండి
  • ప్రధాని మోడీకి కేతన్ అగర్వాల్ తల్లి భావోద్వేగ లేఖ
  • రాష్ట్రపతికి తండ్రి విశాల్ అగర్వాల్ లేఖ
Modiketanagarwal

Modiketanagarwal

దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన పూణె యువ వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసు ఇప్పుడు మరో కీలక మలుపు తిరిగింది. కేతన్ అగర్వాల్ చనిపోయి నెల రోజులు గడుస్తున్నా న్యాయం జరగకపోవడంతో బాధిత కుటుంబం న్యాయం కోసం పోరాడుతోంది. ఇప్పటికే మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ను కలిసి న్యాయం చేయాలని కోరగా.. ఇప్పుడు ఏకంగా ప్రధాని మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్మును వేడుకుంటున్నారు. తమ బిడ్డను చంపిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.

మోడీకి కేతన్ అగర్వాల్ తల్లి లేఖ

తన కుమారుడు కేతన్ అగర్వాల్ హత్యకు గురై దాదాపు నెల రోజులు గడిచినా న్యాయం జరగలేదంటూ కేతన్ తల్లి రాఖీ అగర్వాల్ ప్రధాని మోడీకి భావోద్వేగ లేఖ రాశారు. తన కుమారుడి హత్యకు బాధ్యులైన వారిని చట్టప్రకారం అత్యంత కఠినంగా శిక్షించాలని కోరారు. ‘‘నా బిడ్డకు న్యాయం కోరాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు.’’ అని లేఖలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి తల్లిలాగే తన కుమారుడు మంచి జీవితం గడపాలని.. పెళ్లి చేసుకుని కుటుంబంతో సంతోషంగా ఉండాలని తాను కలలు కన్నానని పేర్కొన్నారు. కానీ చివరకు తన చేతుల మీదుగానే కుమారుడికి అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చిందని కన్నీటి పర్యంతమయ్యారు. ఇంట్లో ప్రతి స్థలములోనూ కేతన్ జ్ఞాపకాలనే గుర్తు చేస్తున్నాయని తెలిపారు. అతని గది, బట్టలు, ఫొటోలు చూసిన ప్రతిసారీ అతడు ఇక తిరిగి రాడనే నిజం గుండెను కలిచివేస్తోందని లేఖలో పేర్కొన్నారు.

కేతన్ మరణం తర్వాత కుటుంబాన్ని మరో విషాదం వెంటాడిందని రాఖీ అగర్వాల్ గుర్తు చేశారు. మనవడిని ఎంతో ప్రేమించిన తన మామ (కేతన్ తాత) ఆ బాధను తట్టుకోలేక కేతన్ మరణించిన 20 రోజుల్లోనే కన్నుమూశారని చెప్పారు. కొద్ది రోజుల వ్యవధిలోనే కుటుంబం రెండు తరాలను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎలాంటి సానుభూతి లేదా ప్రత్యేక సహాయం కోరడం లేదని, తన కుమారుడికి న్యాయం మాత్రమే కావాలని స్పష్టం చేశారు. న్యాయం ఆలస్యమయ్యే కొద్దీ తమ కుటుంబ బాధ మరింత పెరుగుతోందని తెలిపారు. కేతన్ తిరిగి రాకపోయినా, అతని ప్రాణాలు తీసిన వారికి చట్టప్రకారం అత్యంత కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని మోడీని కోరారు.

ఇప్పటికే రాష్ట్రపతికి కూడా లేఖ

ఇదే కేసులో కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్ కూడా ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసి, ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. తమ కుటుంబం ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు కోరడం లేదని, న్యాయం త్వరగా జరిగేలా చర్యలు తీసుకోవాలని మాత్రమే కోరినట్లు పేర్కొన్నారు.

ఏమిటీ కేసు?

పూణెకు చెందిన యువ వ్యాపారి కేతన్ అగర్వాల్ జూన్ 18న మహారాష్ట్రలోని లోహగడ్ కోట దగ్గర హత్యకు గురయ్యారు. కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి కోట పైనుంచి తోసేయడంతో కేతన్ ప్రాణాలు కోల్పోయాడు. దర్యాప్తులో అనుమానాలు రావడంతో హత్య వెలుగులోకి వచ్చింది. సియాను.. ఆమె ప్రియుడు చేతన్‌ను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.